హైదరాబాద్ పరిధిలో ఎల్బీ నగర్ ఇప్పుడొక కోవిడ్ హాట్ స్పాట్. అక్కడ ఒక్కసారిగా 45 కేసులు పెరగటానికి కారణం ఒక షాప్ ఓనర్ తన మిత్రులకు ఇచ్చిన బర్త్ డే దావత్!

ఈ బర్త్ డే దావత్ దెబ్బకు 45 కేసులు నమోదవ్వడమే మాత్రమే కాకుండా కొత్తగా ఆ ఎల్బీ నగర్ ప్రాంతంలో 15 కంటైన్మెంట్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేయవలిసి వచ్చింది ప్రభుత్వం. 

దుకాణం నడుపుకునే ఒక వ్యక్తి మిత్రులకు తన బర్త్ డే సందర్భంగా దావత్ ఇచ్చాడు. దావత్, అందునా పిలిచింది ఖాస్ దోస్తు ఇంకేముంది మిత్రులంతా అక్కడికి వెళ్లారు. అక్కడ ఆరోజు ఫుల్లుగా పార్టీ చేసుకొని ఎంజాయ్ చేశారు. 

ఇక ఆదెబ్బకు రెండు కంటైన్మెంట్ జోన్లతో బిక్కుబిక్కుమనుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఎల్బీ నగర్ ఒక్కసారిగా 15 కంటైన్మెంట్ జోన్లతో హాట్ స్పాట్ గా మారిపోయింది. 

ఇంతకు ఈ దావత్ ఇచ్చిన వ్యక్తి దుకాణం ఎక్కడో తెలుసా...? మలక్ పేట్ గంజ్ లో. అదేనండి మొన్న మలక్ పెట్ గంజ్ లో నమోదైన కేసుల్లో ఇతనొకడు. ఆ వైరస్ ఇతనికి ఆ దుకాణంలో పనిచేసే వ్యక్తిద్వారా సోకింది. అది తెలియక తన మిత్రులందరితో చేసుకున్న పార్టీ దెబ్బకు ఇప్పుడు ఎల్బీ నగరే వణికిపోతుంది. 

ఇకపోతే... తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. గత కొద్దిరోజులుగా చాలా తక్కువ కేసులు నమోదవుతుంటే ఈ మహమ్మారి బారినుండి తెలంగాణ మెల్లిగా బయటపడుతుందని అందరూ భావించారు. కానీ ఇంకా తెలంగాణ రాష్ట్రం కరోనా నుండి బయటపడలేదు. ఇవాళ(శనివారం) ఒక్కరోజే తెలంగాణలో 31పాజిటివ్ కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ గణాంకాలు మరోసారి తెలంగాణలో కలకలాన్ని సృష్టించింది. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇవాళ 30 కేసులు నమోదయ్యాయి. అలాగే  వలస కూలీ ఒకరికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  1163గా నమోదయ్యాయి. అయితే ఇప్పటికే  751 మంది డిశ్చార్జి అవ్వడంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 382గా వుంది. ఇవాళ ఒక్కరోజే మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో 30 కరోనా మరణాలు నమోదయ్యాయి. 

కరోనా వైరస్ పరీక్షలు తెలంగాణలో ఎక్కువగా నిర్వహించడంలేదని తెరాస ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము సరిపోను టెస్టులు నిర్వహిస్తున్నామని, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగానే టెస్టులు నిర్వహిస్తున్నామని చెబుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే... తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కరోనా వైరస్ టెస్టుల గురించి మాట్లాడుతూ.... కేసులు తక్కువగా నమోదవడానికి టెస్టులు చేయకపోవడానికి సంబంధంలేదని, కేసులు బయటపడకపోవడానికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి లేకపోవడం అని కొత్త సిద్ధాంతాన్నే చెప్పారు. 

కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్, తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్ తో నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.... తెలంగాణాలో టెస్టింగ్ తక్కువగా చేస్తున్నట్టున్నారని అన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రే ఇలా తెలంగాణాలో టెస్టులు తక్కువగా నిర్వహిస్తున్నారని అనడంతో ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. అన్ని పార్టీలు కూడా తాము ముందు నుండి కూడా ఇదే విషయం చెబుతున్నామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంటున్నారు.