Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే జీనోమ్ వ్యాలీ రెండో ఫేజ్ ఏర్పాటు: బయో ఏషియా 2024 సదస్సు ప్రారంభించిన రేవంత్

బయోసైన్స్ రాజధానిగా హైద్రాబాద్ కీలకంగా మారిందని  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు.

 BioAsia 2024: CM Revanth announces next phase of Genome Valley lns
Author
First Published Feb 27, 2024, 4:34 PM IST


హైదరాబాద్: త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును మంగళవారంనాడు ముఖ్యమంత్రి  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

 మూడు వందల ఎకరాల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని సీఎం చెప్పారు. దీంతో  మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.

 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయన్నారు. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న బయోఏషియా సదస్సు కీలకంగా మారిందన్నారు. బయోసైన్స్ రాజధానిగా హైదరాబాద్ నేడు యావత్ మానవాళికి ఒక భరోసాగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతోందని  సీఎం ప్రస్తావించారు.

 

ఆరోగ్య భద్రత విషయంలో ప్రపంచంలోని అందరి సమస్యలు ఒకేలా ఉన్నాయని కోవిడ్ నిరూపించిందన్నారు. సమస్యల పరిష్కారాలను కూడా మనం కలిసికట్టుగానే సాధించాలని సీఎం సూచించారు. ఒక్క బయో సైన్సెస్ లోనే కాదు, ఐటీ-సాఫ్ట్ వేర్,  రీసెర్చ్, స్టార్టప్ రంగాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన అనుకూల వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు.  ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీ స్థాయిలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం గుర్తు చేశారు. ఏటా 5కోట్ల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తే లక్ష్యంగా ప్రఖ్యాత టకేడా సంస్థ ఇక్కడి బయోలాజికల్-ఈ సంస్థతో కలిసి హైదరాబాద్ లో తయారీ కేంద్రం నెలకొల్పడాన్ని స్వాగతించారు. 

తొలుత జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహిత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాను సీఎం అభినందించారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సెమెంజాకు అవార్డును అందించారు

Follow Us:
Download App:
  • android
  • ios