Asianet News TeluguAsianet News Telugu

సాగుపై పెద్ద నోట్ల దెబ్బ

  • పెట్టుబడులకు డబ్బులేక రైతుల ఇబ్బందులు
  • కేంద్రం నిర్ణయంపై కృష్ణ డెల్టా పరిరక్షణ సమితి ఆగ్రహం
bignotes cancel effect on paddy

 

పెద్ద నోట్ల రద్దుతో వ్యవసాయ రంగం కుదేలైందని, పంట చేతికొచ్చే సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతన్నల వెన్ను విరిచిందని కృష్ణ డెల్టా పరిరక్షణ సమితి పేర్కొంది.

 

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రైతుల ఇక్కట్లపై కృష్ణ డెల్టా పరిరక్షణ సమితి శనివారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసింది.

 

ఈ సందర్భంగా కృష్ణ డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కె. శివాజి, రైతు సంఘం నేతలు ఎర్నెని నాగేంద్రనాథ్, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు మాట్లాడుతూ.... కేంద్ర తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్ద నోట్లు చెల్లక, చెక్కులు ఎలా నగదుగా మార్చాలో తెలియక వ్యవసాయదారులు ఆందోళన చెందుతున్నారన్నారు.

 

రబీ సీజన్ మొదలవుతున్న సమయంలో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో సాగుదారులు ఈ సీజన్ పై ఆశలు వదిలేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

 

‘బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే ఇన్నాళ్లు బంగారం తాకట్టు పెట్టకొనైనా రైతులు రుణాలు తెచ్చి సాగు చేసేవారు. లేదంటే వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకునేవారు. కానీ, ఇప్పుడు నోట్ల రద్దుతో రైతన్నలకు అప్పు పుట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

 

పంట రుణాల సంగతి దేవుడెరుగు కనీసం కొన్ని రైతు కుటుంబాల్లో  రోజు గడిచే పరిస్థితి కూడా కష్టంగా ఉంది. నిత్యావసర వస్తువులు కొనేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి నెలకొందని’ రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

 

వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత ఘోరంగా తయారైందని, రొక్కాడితేనేకాని డొక్కాడని స్థితిలో ఉన్న వారిపై నోట్ల రద్దు పిడుగుపాటులా మారిందని పేర్కొన్నారు. వరి కోతల సమయంలో నోట్ల రద్దు నిర్ణయం రావడంతో కూలీ చెల్లింపులు సమస్యగా మారిందన్నారు.

 

దీంతో పంటను కోయకుండా రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని, కూలీలు పని దొరక్క అవస్థలు పడుతున్నారని తెలిపారు.కృష్ణా డెల్టా ప్రాంతంలో రైతులు, రైతుకూలీల పరిస్థితి దారుణంగా ఉందని, పంట చేతికొచ్చిన సమయంలో కోత కోయలేని పరిస్థితి ఎదురైందని వారు పేర్కొన్నారు. రబీ సీజన్ కు పెట్టుబడి పెట్టేందుకు రైతుల చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండాపోయిందన్నారు.

 

ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సమస్యలు పట్టించుకోకుండా కేంద్రానికి వంతుపాడడంపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఈ సమయంలో చంద్రబాబు పబ్లిసిటీ కోసం ప్రయత్నించకుండా రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios