హైదరాబాద్: హైద్రాబాద్ గచ్చిబౌలి లోని పబ్‌లో బిగ్ బాస్-3 విజేత, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి కేసులో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్టుగా గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ చెప్పారు.

Also read:యువతితో పబ్ కు వెళ్లిన బిగ్ బాస్ విజేత రాహుల్ పై బీర్ బాటిల్స్ తో దాడి

గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో  బుధవారం నాడు రాత్రి  తన  స్నేహితులతో కలిసి  వెళ్లిన రాహుల్‌పై టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు దాడికి పాల్పడినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని రోహిత్ రెడ్డి ఖండిస్తున్నాడు. తన సోదరుడి స్నేహితులు ఈ దాడిలో ఉన్నారని ఆయన చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ గొడవ గురించి రాహుల్ సిప్లిగంజ్ మాత్రం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పబ్ నిర్వాహకులు మాత్రం రాహుల్ పై దాడి జరిగినట్టుగా తమకు ఫిర్యాదు చేసినట్టుగా  సీఐ  చెప్పారు. విచారణలో ఈ దాడికి గల వివరాలు తేలుస్తామని ఆయన ప్రకటించారు.

రాహుల్ తన స్నేహిులతో కలిసి పబ్ కు వచ్చాడన్నారు సీఐ. ఎమ్మెల్యే సోదరుడు కూడ తన స్నేహితులతో కలిసి వెళ్లినట్టుగా  సీఐ చెప్పారు. సింగర్ రాహుల్ తనపై దాడి జరిగిన విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని  సీఐ శ్రీనివాస్ చెప్పారు. చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారిందని  సీఐ చెప్పారు.