హైదరాబాద్: బిగ్‌బాస్-3 విజేత, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పై హైద్రాబాద్ లో ని ఓ పబ్బులో బుధవారం నాడు రాత్రి జరిగింది. తలపై బీరు సీసాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. గాయం చిన్నదే అంటూ ఆస్పత్రి వైద్యులు అతన్ని డిశ్చార్జీ చేశారు.

బుధవారం నాడు రాత్రి పదకొండున్నర సమయంలో రాహుల్ సిప్లిగంజ్ హైద్రాబాద్ గచ్చిబౌలిలోని పబ్ కు వచ్చాడు. అతనితో పాటు ఓ యువతి, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు.

పబ్ కు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల పబ్ లోని కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయమై రాహుల్ వారిని నిలదీశాడు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఈ క్రమంలోనే ప్రత్యర్థులు రాహుల్ సిప్లిగంజ్ తలపై బీరు బాటిల్స్ తో దాడికి దిగారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇదిలా ఉండగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువుల పట్ల అనుచితంగా రాహుల్ సిప్లిగంజ్ ప్రవర్తించాడని దాడికి పాల్పడినవారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడికి దిగినట్టుగా చెబుతున్నారు. 

దాడికి గురైన రాహుల్ సిప్లిగంజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పోలీసులు పబ్ లో ఉన్న సీసీటీవీపుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అసలు పబ్ లో ఏం జరిగిందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. పబ్ లోని సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు.