సండే రోజు సప్పటి తిండే పెద్దనోట్ల రద్దుతో అంతా వెజిటేరియన్లే భారీగా తగ్గిన కోళ్లు, గుడ్డు ధరలు అయినా కొనే వారు లేరు తినేవారు లేరు
మోదీ దెబ్బకు జనాలు చస్తుంటే.. కోళ్లు మాత్రం బతికిపోయాయి. అవును మీరు చదవుతుంది నిజమే.. ఎలాగంటారా...
పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల దేశం అతాలకుతలమవుతోంది. బ్యాంకుల ముందు క్యూ కట్టి జనాలు లబోదిబోమంటున్నారు. చేతిలో డబ్బులున్నా ఖర్చు పెట్టలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
వంద నోటు దొరికితే చాలు బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉన్న కాసిన్ని నోట్లను జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. ఆదివారం రోజు అలవాటుగా నాన్ వెజ్ తినే కుటుంబాలు కూడా పెద్ద నోట్ల దెబ్బకు సడెన్ గా వెజిటేరియన్లుగా మారిపోయాయి. దీంతో కోళ్లు కాస్త బతికిపోయాయి.
కానీ, ఎటొచ్చి కోళ్ల పరిశ్రమకు ఈ నోట్ల దెబ్బ బాగానే తగిలింది. దేశంలో కోళ్ల పరిశ్రమలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు నోట్ల రద్దుతో పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా కుదేలైంది.
అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ యజమానులు విలవిలలాడుతున్నారు. గుడ్ల ధర మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
పాత నోట్ల రద్దుకు ముందు ఒక్కోటి రూ.4.18 పలికిన గుడ్డు ధర ప్రస్తుతం రూ.2.90కి పడిపోయింది. దీంతో గుడ్లన్ని మురిగిపోతున్నాయి.
ఇక కోడి మాంసానికీ కూడా డిమాండ్ పడిపోయింది. ఆదివారం చికెన్ సెంటర్లన్నీ వినియోగదారులతో కళకళలాడుతుండేవి.
కానీ, ఇప్పడు ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. సండే రోజు కూడా సప్పటి తిండే తినేస్తున్నారు. కోడి మాంసం ధర కొన్ని చోట్ల సగానికి తగ్గించినా కొనే దిక్కు లేదు.
ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి చివరిదాకా కోడిమాంసం, గుడ్ల వ్యాపారం గరిష్ట స్థాయిలో ఉంటుంది. అయితే నోట్ల రద్దు ప్రకటించిన రోజు నుంచి క్రయవిక్రయాలు 70 శాతం పడిపోయాయి.
