శ్రీచైతన్య కాలేజీలో కోమటిరెడ్డి బైఠాయింపు:సాత్విక్ మృతికి కారకులపై చర్యలకు డిమాండ్
సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన నలుగురిపై చర్యలకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి :శ్రీచైతన్య కాలేజీ ఆవరణలో బైఠాయించారు.
హైదరాబాద్: సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన నలుగురిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శ్రీచైతన్య కాలేజీలోనే బైఠాయించారు. ఈ నలుగురిని అరెస్ట్ చేసే వరకు తాను ఆందోళనను కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు.
గురువారం నాడు ఉదయం రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీచైతన్య కాలేజీ కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చాడు. సాత్విక్ ఆత్మహత్య చేసుకొనే ముందు సూసైడ్ లెటర్ రాశాడు.ఈ లేఖలో రవి, కృష్ణారెడ్డి, ఆచార్య, నరేష్ ల పేర్లను సాత్విక్ పేర్కొన్నారు. ఈ నలుగురిని అరెస్ట్ చేశారా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. వారిని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పారు. దీంతో కాలేజీలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బైఠాయించారు. ఈ నలుగురిని అరెస్ట్ చేసే వరకు తాను దీక్షకు దిగుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.
సాత్విక్ పేరేంట్స్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేశారు. సాత్విక్ ఆత్మహత్య ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాత్విక్ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన హమీ ఇచ్చారు. మరో వైపు పోలీస్ ఉన్నతాధికారులతో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
also read:సాత్విక్ కేసు: ఇంటర్ బోర్డు, సబితా ఇంటి వద్ద విద్యార్ధి సంఘాల ధర్నా
ర్యాంకుల కోసం నారాయణ, శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యాలు విద్యార్ధుల జీవితాలతో ఆడుతకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలపై కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.