సాత్విక్ కేసు: ఇంటర్ బోర్డు, సబితా ఇంటి వద్ద విద్యార్ధి సంఘాల ధర్నా
సాత్విక్ మృతికి కారణమైన శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని విద్యార్ధి సంఘాల నేతలు ఇవాళ ఆందోళనకు దిగారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందు విద్యార్ధులు ధర్నాకు దిగారు.
హైదరాబాద్: తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద గురువారంనాడు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. మరో వైపు ఇంటర్ బోర్డు ఎదుట ఏబీవీపీ ఆందోళనకు దిగింది.
నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కారణమైన శ్రీచైతన్య కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. హైద్రాబాద్ బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో గల మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ విద్యార్ధి సంఘాలు ఇవాళ ముట్టడించాయి. మంత్రి నివాసంలోకి విద్యార్ధి సంఘ నేతలు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాయి. అయితే పోలీసులు వారిని నిలువరించారు. విద్యార్ధి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు.
ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏబీవీపీ ముట్టడించింది. శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యంపై చర్యలకు ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఏబీవీపి నిరసనకు దిగింది.
నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ముందు నిన్న కూడా విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది వేధింపులకు గురిచేసేవారని సాత్విక్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో కొందరి పేర్లను సాత్వికి పేర్కొన్నారు. సాత్విక్ సూసైడ్ లేఖలో పేర్కొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రవ్నిస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీలో పనిచేసే సిబ్బందితో పాటు కాలేజీ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
also read:తెలంగాణకు హోంమంత్రి ఉన్నాడా?: సాత్విక్ కేసులో పోలీసులపై కోమటిరెడ్డి ఫైర్
గతంలో కూడా సాత్విక్ ను కాలేజీ లెక్చరర్లు కొట్టారని పేరేంట్స్ ఆరోపించారు. సాత్విక్ ను లెక్చరర్లు కొట్టడంతో 15 రోజులు బెడ్ రెస్ట్ లో ఉన్నాడని పేరేంట్స్ గుర్తుకు చేసుకున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సాత్విక్ పేరేంట్స్ డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ తో నిన్న కాలేజీ ముందు ఆందోళనకు దిగారు.