హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో తనపై శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్‌ నేత భూపతిరెడ్డి మండిపడ్డారు. ఇది రాష్ట్రంలోనే చీకటి రోజు అని, ముగ్గురి మీద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించడం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని ఆయన ఆయన వ్యాఖ్యానించారు. 
టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్‌ రెడ్డిలను అనర్హలుగా మండలి చైర్మన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భూపతి రెడ్డి బుధవారంనాడు స్పందించారు.

తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, తాను ఏ పార్టీ గుర్తు మీద కూడా గెలువలేదని, గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదని, తనపై ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాసలో విలీనం అయినట్లు గెజిట్ కూడా విడుదల చేశారని అంటూ అలాంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 

ఏ ప్రాతిపదికన తనపై అనర్హత వేటు వేశారని ఆయన అడిగారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిరాయింపు కేసు వేశామని, కానీ దానిపై చర్యలు తీసుకోలేదని, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఎన్నుకుంటేనే కదా మండలి చైర్మన్ అయ్యారని ఆయన అన్నారు. 

పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని భూపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కోర్టుకు వెళతానని, న్యాయపోరాటం చేస్తానని చెప్పారు.

సంబంధిత వార్త

ఆ ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు: ప్రకటించిన శాసన మండలి