బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టైన నాటి నుంచి ఆమె సోదరి భూమా మౌనిక రెడ్డి తరచుగా మీడియా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆళ్లగడ్డలో భూమా మౌనికా రెడ్డి ప్రత్యక్షమయ్యారు.

నియోజకవర్గంలోని కీలక నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ.. అఖిల ప్రియ అరెస్టు వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే అఖిలప్రియను పోలీసులు, వైద్య సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

ఇది కేవలం హఫీజ్‌పేట్ భూముల వ్యవహారం మాత్రమే కాదని.. దాని వెనక చాలా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని మౌనికా రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క సాక్ష్యం కూడా లేకుండా కోర్టులో హాజరుపరిచారని ఎద్దేవా చేశారు.

Also Read:భూమా అఖిలప్రియ బయటికొస్తే బెదిరిస్తారు: పోలీసుల వాదన

అక్కను అరెస్టు చేస్తున్నట్లు కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం లేదని మౌనిక తెలిపారు. కనీసం లేడీ కానిస్టేబుల్ కూడా వెంట లేకుండా అఖిలప్రియను అరెస్టు చేశారని ఆమె మండిపడ్డారు. 

అఖిలప్రియ కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని, తెలంగాణ డీజీపీని కలిసి తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇకపై కార్యకర్తలకు తాను అండగా ఉంటానని మౌనికా రెడ్డి హామీ ఇచ్చారు.

మరోవైపు న్యాయస్థానం ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి అఖిల ప్రియను రహస్యంగా ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించిన జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం బెయిల్ పిటీషన్, కస్టడీ పిటిషన్‌కు సంబంధించిన వాదనలు సికింద్రాబాద్ కోర్టులో జరగనున్నాయి.