హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. బయటకు వస్తే అఖిలప్రియ సాక్షులను బెదిరించే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈ మేరకు వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. 

బెయిల్ కోసం అఖిలప్రియ ప్రయత్నాలు సాగిస్తున్నారు. తన ఆరోగ్యం బాగా లేదంటూ తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అయితే, ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ మీద, కస్టడీ పిటిషన్ మీద రేపు సోమవారం విచారణ జరగనుంది.

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో తొలి ముద్దాయిగా ఉన్న అఖిలప్రియను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు శుక్రవారంనాడు సికింద్రాబాదు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారం రోజుల పాటు విచారించాల్సి ఉందని వారు కోర్టుకు తెలిపారు. అఖిలప్రియ అనుచరులు మరిన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్ రామ్ తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని వారు కోర్టుకు వివరించారు. 

కిడ్నాప్ చేసిన ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావులను హైదరాబాదు శివార్లలోని ఫామ్ హౌస్ లో బంధించి, కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు కోర్టుకు చెప్పారు. వాటిని స్వాధీనం చేసుకోవడానికి అవి ఎక్కడున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు మిగిలిన నిందితులను అరెస్టు చేసిన తర్వాత సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేపట్టాల్సి ఉందని పోలీసులు చెప్పారు. 

ఇదిలావుంటే, ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో పోలీసులు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం గాలిస్తున్నారు. రెండు బృందాలతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్గవ్ రామ్ బెంగళూరులో గానీ పూణేలో గానీ తలదాచుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మాదాల శ్రీనివాస చౌదరి అలియాస్ గుంటూరు శ్రీను కోసం మరో పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు, కిడ్నాప్ నకు వాడిన కార్లను పోలీసులు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

గత నాలుగు రోజులుగా గుంటూరు శ్రీను తల్లిదండ్రులు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. గుంటూరులోని తమ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారని సమాచారం. శ్రీను కోసం తెలంగాణ పోలీసులు గుంటూరుకు వచ్చారా అని అడిగితే తమకు సమాచారం లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. గుంటూరు శ్రీను కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచాఫ్ లో ఉన్నాయి.