తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు 2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 11మంది సజీవదహనం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేసారు. బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని భారీగా ప్రాణనష్టం జరగడం బాధాకరమన్నారు. తమవారి మృతితో దు:ఖిస్తున్న బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఈ అగ్నిప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ కింద 2లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి:
ఇక ఈ అగ్నిప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. బిహార్ నుండి ఉపాధి కోసం వలసవచ్చిన కార్మికులు ఇలా మంటల్లో చిక్కుకుని సజీవదహనం కావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.5లక్షల ఎక్స్ గ్రేషియాను ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
అంతేకాకుండా ఈ అగ్నిప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక మృతదేహాలను బిహార్ లోని స్వస్థలాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రమాదస్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని
ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎస్ తో కలిసి బోయిగూడ అగ్నిప్రమాద ప్రాంతానికి చేరుకున్నారు. గోడౌన్ ను పరిసరాలను పరిశీలించిన మంత్రి అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగితెలుసుకున్నారు. ఇక అగ్నిప్రమాదం జరిగిన టింబర్ డిపో వద్దకు తెలంగాణ జనసేన పార్టీ ఇన్చార్జి శంకర్ గౌడ్ కూడా చేరుకున్నారు.
మృతుల కుటుంబాలకు బండి సంజయ్ సానుభూతి:
ఇక హైదరాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఈ ప్రమాదంలో 11 మంది పేద కార్మికులు సజీవదహనం కావడం కలచివేసిందన్నారు. మృతులంతా బీహార్ వాసులని తెలిసిందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని సంజయ్ అన్నారు.
బిహార్ నుండి తెలంగాణకు పొట్టకూటికోసం వచ్చిన కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సంజయ్ అన్నారు. అనుమతుల నుండి ఫైర్ సేఫ్ట్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావ్రుతం కాకుండా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.
అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే..
ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల దాటికి గోడౌన్ లోని సిలిండర్ పేలడంతో మంటలు మరింత ఉదృతమయ్యాయి. మంటలు వేగంగా టింబర్ డిపో, స్క్రాప్ గోడౌన్ మొత్తాన్ని వ్యాపించడంతో అందులో నిద్రిస్తున్న కార్మికులకు తప్పించుకోడానికి వీలులేకుండా పోయింది. మొత్తం 15 మందిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మిగతా 11మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
గోడౌన్ కింది భాగంలో ఉన్న రూమ్ లో ముగ్గురు ఉంటారు. పై భాగంలో మిగిలినవారు ఉంటారు. పై భాగంలో ఉన్న వారు కిందికి రావాలంటే గోడౌన్ మధ్యలో ఉన్న ఇనుప మెట్ల నుండి కిందకు రావాల్సి ఉంటుంది. అయితే మంటలు తీవ్రంగా వ్యాప్తి చెందిన కారణంగా ఇనుప మెట్ల నుండి ఫై ఫ్లోర్ లో చిక్కుకున్న కార్మికులు కిందకు రాలేకపోయారు. అంతేకాదు ఈ గోడౌన్ కు బయటకు వెళ్లేందుక మరో దారి కూడా లేదు. దీంతో పై ఫ్లోర్‌లో ఉన్న కార్మికులు కిందకు రాలేకపోయినట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారు బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేంతర్, చింటు, దినేష్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్ లుగా గుర్తించారు. మృతులంంతా బీహార్ రాష్ట్రానికి చెందినవారే. వీరి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బిహార్ కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
