తెలంగాణ ఎన్నికల వేళ భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారత జాగృతి నూతన అధ్యక్షులను ప్రకటించారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ సంసిద్దమవుతోంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలకు షాకిస్తూ రాష్ట్రంలోని 115 నియోజకవర్గాల్లో పోటీచేసే బిఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికలను దృష్టిలో వుంచుకుని భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు అధ్యక్షులతో పాటు రాష్ట్ర కార్యదర్శిని నియమిస్తూ భారత జాగృతి ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాల వారిగా భారత జాగృతి అధ్యక్షుల వివరాలు :
జోగులాంబ గద్వాల - ఎల్వీఎన్ రెడ్డి
సిద్దిపేట - పి. శ్రీధర్ రావు
హైదరాబాద్ - అప్పాల నరేందర్ యాదవ్
యాదాద్రి భువనగిరి - సుజిత్ రావు
మెదక్ - వీరప్పగారి రమేష్ గౌడ్
హన్మకొండ - మూల రాముగౌడ్
కేవలం జిల్లా కమిటీల ఏర్పాటే కాదు రాష్ట్రస్థాయి, అంతర్జాతీయ స్థాయి పదవులను కూడా భారత జాగృతి నియమించింది. ఇటలీలో భారత జాగృతి కమిటీ అధ్యక్షునిగా కిశోర్ యాదవ్ ను నియమించారు. అలాగే జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా ప్రశాంత్, హైదరాబాద్ జిల్లా కో కన్వీనర్ గా వేణుగోపాల్ రావు, యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ గా బొల్లంపల్లి సందీప్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత జాగృతి అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఉత్తర్వులు జారీ చేసారు.
Read More కాంగ్రెసోళ్లు మనోళ్లే.. మనమే కొందరిని పంపించినం: బాల్క సుమన్ సంచలనం
ఇదిలావుంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో కవిత కీలకంగా వ్యవహరించారు. తన వర్గానికి చెందిన నాయకులకు టికెట్లు ఇప్పించుకోవడంలో కవిత సక్సెస్ అయ్యారు. అంతేకాదు టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులతో మాట్లాడి బుజ్జగించే బాధ్యతను కూడా ఆమె తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో వుండటం, సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం లేకపోవడంతో బిఆర్ఎస్ ఆశావహులంతా కవితను ఆశ్రయించారు. దీంతో టికెట్ దక్కని నాయకులు పార్టీని వీడకుండా వారితో చర్చించి రాజకీయంగా ఎలాంటి డ్యామేజ్ జరక్కుండా చూసుకున్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, టికెట్ ఆశించిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు కాకుండా మాజీ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈసారి బిఆర్ఎస్ టికెట్ దక్కింది. దీంతో టికెట్ దక్కని ఎమ్మెల్యే, మాజీ మేయర్ లతో కవిత సమావేశమై బుజ్జగించారు. రాజకీయ భవిష్యత్ పై కవిత భరోసా ఇవ్వడంతో ఇద్దరు నేతలు అసంతృప్తితో వున్నా బిఆర్ఎస్ లోనే కొనసాగేందుకు సిద్దపడ్డారు.
