ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దని వ్యాఖ్యానించారు.
మంచిర్యాల: ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెన్నూర్ నుంచి మరోసారి పార్టీ అభ్యర్థిగా బాల్క సుమన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం నియోజకవర్గంలో బాల్క సుమన్ ప్రజా ఆశ్వీర్వాద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జైపూర్, భీమారం, కిష్టంపేట మీదుగా చెన్నూర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దని అన్నారు. కొందరిని తామే కాంగ్రెస్ పార్టీలోకి పంపామని.. అందరూ మన దగ్గరికే వస్తారని సంచలన కామెంట్స్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెంకటేష్ నేత కూడా తిరిగి బీఆర్ఎస్‌లోకే వచ్చారని కూడా ప్రస్తావించారు. ఆ సమయంలో బాల్క సుమన్ పక్కనే ఉన్న వెంకటేష్ నేత.. రెండు చేతులు పైకెత్తి విన్ సింబల్ చూపెట్టారు.
‘‘కాంగ్రెసోళ్ల విషయంలో మీరు కూడా దయచేసి ఏమనకండి. వాళ్లు ఊళ్లలో తిరుగుతుంటే మనోళ్లు అదోటి ఇదోటి అంటున్నారు. ఏమనకండి.. వాళ్లు కూడా మనోళ్లే. వెంకన్న(వెంకటేష్ నేత) రాలేదా.. వాళ్లందరూ మనోళ్లే. మీకు అసలు విషయం చెప్పాలంటే.. మనమే కొందరిని పంపించినం కూడా.. బయట చెప్పొద్దు.. రాజకీయాలు అన్నప్పుడు ఇలాంటివి నడుస్తాయ్.. తెలివి తేటలు వాడాలి కదా’’ అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
ఇక్కడ వెంకటేష్ నేత విషయానికి వస్తే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వెంకటేష్ నేత ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ గూటికి చేరిన వెంకటేష్ నేత.. లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు.
అయితే బాల్క సుమన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే గత కొంతకాలంగా ఈటల రాజేందర్‌తో సహా పలువురు నేతలు.. కేసీఆర్ కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు బండి సంజయ్ కూడా.. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా బాల్క సుమన్.. కాంగ్రెస్‌పై కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారా? నిజంగా ఆయన చెప్పినట్టుగా కాంగ్రెస్‌లోకి కేసీఆర్ కోవర్టులను పంపారా? అనే చర్చ సాగుతుంది. గతంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా.. బాల్క సుమన్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను కూడా ఒకింత కలవరానికి గురిచేసేలా ఉన్నాయి.
