హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో గవర్నర్ తమిళసై ఢీకొంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో గణపతి విగ్రహాలను స్థాపించకూడదని, ఇళ్లలోనే పూజలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కూడా ఆదేశాలు ఇచ్చారు. 

అయితే, భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తోంది. పూజలు చేయడానికి ఎవరి అనుమతి కూడా అవసరం లేదని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బలవంత రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించడానికే భాగ్యనగర ఉత్సవ సమితి నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 

Also Read: దేవుడి పూజకు అనుమతి అవసరం లేదు: భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి

అయితే, ఖైరతాబాద్ గణేశుడికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేయడానికి రావాల్సిందిగా భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు గవర్నర్ తమిళిసైని ఆహ్వానించనున్నారు. రేపు వారు ఆమెను కలిసి ఆహ్వానం పలుకుతారు. 

ఖైరతబాదులో వినాయక విగ్రహాన్ని స్థాపించడానికే భాగ్యనగర ఉత్సవ సమితి నిర్ణయించుకుంది. ఈసారి 9 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాదులో నెలకొల్పనున్నారు. ధన్వంతరి నారాయణ మహా గణపతిని నెలకొల్పి పూజలు నిర్వహిస్తారు. 

Also Read: షాక్: కేసీఆర్ మీద తమిళిసై సంచలన వ్యాఖ్యలు

ఈ నెల 22వ తేదీన ధన్వంతరి నారాయణ మహాగణపతికి తమిళిసై తొలి పూజ చేస్తారని వారంటున్నారు. 100 కిలోల లడ్డూ ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే, తమిళిసై తొలి పూజకు వస్తారా, రారా అనేది రేపు తెలిసిపోతుంది. 

అయితే, కేసీఆర్ ప్రభుత్వం ఖైరతాబాదులో గణేశుడి విగ్రహాన్ని నెలకొల్పడాన్ని అనుమతిస్తుందా, లేదా అనేది కూడా చూడాల్సే ఉంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా విగ్రహాన్ని నెలకొల్పుతామనే సంకల్పంతో భాగ్యనగర ఉత్సవ సమితి ఉంది. ప్రభుత్వ అనుమతి ఇవ్వకున్నా నెలకొల్పే గణేశుడి పూజకు తమిళిసై వస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. కేసీఆర్ ప్రభుత్వం చూసీచూడనట్లు ఉంటుందా అనేది కూడా చూడాల్సే ఉంది.