దేవుడి పూజకు అనుమతి అవసరం లేదు: భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి
దేవుడిని పూజించడానికి ఎవరి అనుమతి అవసరం లేదని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు చెప్పారు. గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు.
హైదరాబాద్: దేవుడిని పూజించడానికి ఎవరి అనుమతి అవసరం లేదని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు చెప్పారు. గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు.
కరోనా నేపథ్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే.
సోమవారం నాడు మంత్రులు, పోలీసు అధికారులు గణేష్ ఉత్సవాల విషయమై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ సమావేశం కంటే ముందుగానే భాగ్యనగర్ ఉత్సవ సమితితో మంత్రులు సమావేశం నిర్వహించారు. అయితే గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఎలాంటి ఆంక్షలు లేవని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ సమావేశంలో ప్రకటించినట్టుగా భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మంత్రి తలసాని ప్రకటనకు భిన్నంగా పోలీసులు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో మరో రకమైన ప్రకటన చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగానే గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.