తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి.. ఏ మూల చూసినా కనీసం 45 డిగ్రీలు తగ్గడం లేదు. ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి సమయంలో మందు బాబులకు పెద్ద కష్టం వచ్చింది.

ఎండల్లో ఉపశమనం కోసం బీరు తాగి తాత్కాలిక ఉపశమనం పొందుతారు మద్యం ప్రియులు. అందుకే వేసవిలో బీర్ల అమ్మకాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆ సమయాల్లో వైన్స్, బార్లు వద్ద బీరు నో స్టాక్ అనే బోర్డులు కనిపిస్తాయి.

అయినప్పటికీ ఎక్కువ ధర చెల్లించి అయినా బీరు తాగుతారు. అయితే ఈ సారి మాత్రం పరిస్థితి దారుణంగా తయారైంది. ఉత్పత్తి తగ్గినందున ఈ ఏడాది బీర్ల కొరత ఎక్కువగా ఉంది. బీర్ల ఉత్పత్తికి అధికంగా నీరు అవసరం అవుతుంది.

ఎండల తీవ్రతతో జలాశయాలు, నదులు ఎండిపోవడంతో బీర్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు సరఫరా నిలిచిపోయింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి 5 బీరు కంపెనీలకు నీటి సరఫరా జరుగుతుంది.

అయితే జలాశయంలో నీరు లేకపోవడంతో కంపెనీలకు సరఫరా నిలిపివేశారు. దీంతో కంపెనీలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించుకుంటున్నాయి. ఉత్పత్తి లేకపోవడంతో రాష్ట్రంలో బీరు కొరత అధికమైంది.

గతంలో 100 కార్టన్ల బీరు సరఫరా చేసే రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ ఆర్డర్ చేసిన మొత్తంలో 10 నుంచి 25 శాతం వరకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. గతంలో వారానికి రెండుసార్లు బేవరేజెస్ గోదాంల నుంచి బీర్ల సరఫరా జరిగేది.

ప్రస్తుతం ఇండెంట్ పెట్టినా ఒకేసారి సరిపడా స్టాక్ ఇవ్వకపోవడం, ఆర్డర్ చేసిన దాంట్లో కొంత మాత్రమే ఇవ్వడంతో ప్రతి రోజు బీర్ల కోసం గోదాంలకు వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు చలాన్, గేట్ పాస్, రవాణా చార్జీల రూపంలో దుకాణ దారులపై అదనపు భారం పడుతోంది.

వీటన్నింటి కారణంగా వినియోగదారులకు ఇష్టమైన బీర్ బ్రాండ్ దొరకడం లేదు. వర్షాలు కురిసి జలాశయాల్లో నీరు చేరి బీర్ల ఉత్పత్తి పెరిగితేనే సమస్య తీరుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.