BC Reservations : ఏకంగా దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేయాలని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని సూచించారు. ఎందుకో తెలుసా? 

BC Reservations : స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ఇందుకు మీరంటే మీరే కారణమంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య మాటలయుద్దం సాగుతోంది. ఇదే అదునుగా ప్రతిపక్ష బిఆర్ఎస్ రెండు పార్టీలను టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు ఈ వివాదంపై తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు. బిసి రిజర్వేషన్లపై కాదు ఏకంగా కేంద్రం ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రేవంత్ సర్కారుకు కవిత సూచించారు.

ఇక రాష్ట్రపతిపైనే న్యాయపోరాటం : కవిత

తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి 6 నెలలు గడిచిందని కవిత గుర్తుచేశారు. ఈ రెండు బిల్లులు ఇప్పటివరకు రాష్ట్రపతి ఆమోదానికి నోచుకోలేదు... ఈ బిల్లులకు చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న ప్రయత్నం కూడా చేయలేదని కవిత అన్నారు.

2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని కవిత గుర్తుచేశారు. ఇలా అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులు రాష్టప్రతి వద్ద, చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నం.9 పై హైకోర్టు స్టే విధించిందన్నారు. కాబట్టి అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆరు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్రపతిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కవిత సూచించారు.

ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది... వెంటనే కేంద్రం తీరుపై న్యాయపోరాటం చేయాలని కవిత సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి బిసిలకు న్యాయం జరిగేలా చూడాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

బిసి రిజర్వేషన్ పై సుప్రీంకోర్టుకు రేవంత్ సర్కార్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన జీవో9 పై హైకోర్టు స్టే విధించడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ఇక సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు బిసి రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కీలక చర్చలు జరిగాయి. టిపిసిసి చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ లతో జూమ్ మీటింగ్ ద్వారా చర్చించారు. ఇందులో ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ జాతీయ నాయకులు అభిషేక్ సింఘ్వీ కూడా పాల్గొన్నారు.

బిసి రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్ట్ విధించిన స్టే ఎత్తివేయాలని సుప్రీంకోర్టును కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతోంది. మరి దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.