ట్రెండ్ ను ఫాలో కాం, సృష్టిస్తాం: బాలకృష్ణ

Basavatarakam cancer hospital 18th anniversary celebrations in Hyderabad
Highlights

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోోత్సవ వేడుకలు


హైదరాబాద్: మేం ట్రెండ్‌ను ఫాలో కాం,  ట్రెండ్‌ను సృష్టిస్తామని  సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు.  తనకు తన తండ్రి  ఎన్టీఆర్ ఆదర్శమని ఆయన చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం  పనిచేస్తున్నట్టు చెప్పారు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 18వ, వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ శ్రేయ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ రోగం వల్ల  తన తల్లి మరణించిందని ఆయన గుర్తు చేసుకొన్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలనే ఉద్దేశ్యంతోనే  ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్టు ఆయన గుర్తు చేశారు.

క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే  సులభంగా నయం చేసే అవకాశం లేకపోలేదని బాలకృష్ణ చెప్పారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఆసుపత్రిలో ఫీజులో కొంత మినహయింపు ఇస్తున్నామని ఆయన చెప్పారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి క్యాన్సర్ చికత్సను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు బాలకృష్ణ చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున తమ తల్లికి క్యాన్సర్ టెస్టులు నిర్వహించాలని బాలకృష్ణ సూచించారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఇద్దరు సీఎంలు ఎన్టీఆర్ శిష్యులేనని ఆయన గుర్తు చేశారు. ఆసుపత్రికి  ట్యాక్స్ ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో  అత్యాధునిక సౌకర్యాలున్నట్టు బాలకృష్ణ చెప్పారు. 

బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ బాగా రావాలని కోరుకొంటున్నట్టుగా  నిజామాబాద్ ఎంపీ కవిత కోరారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్న  బాలకృష్ణను ఆమె అభినందించారు. ప్రతి జిల్లాకు క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రతి ఏటా 7 లక్షల మందికి క్యాన్సర్ వ్యాధి వస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 

ప్రతి ఒక్కరూ కూడ ప్రతి ఏటా క్యాన్సర్  పరీక్షలు  చేయించుకోవాలని  సినీ నటి  శ్రేయా అభిప్రాయపడ్డారు. బసవతారకం క్యాన్సర్  ఆసుపత్రి ద్వారా ఎందరో  పునర్జన్మ పొందారని ఆమె గుర్తు చేశారు.  ఎన్టీఆర్ గొప్ప సంకల్పం ఉన్న  వ్యక్తి అని  సినీ దర్శకులు బోయపాటి శ్రీను అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం బాలకృష్ణ పనిచేస్తున్నారని  ఆయన చెప్పారు.  ఆసుపత్రికి రూ.10 లక్షలను విరాళంగా ఇస్తున్నట్టు బోయపాటి శ్రీనివాస్ ప్రకటించారు. 
 

loader