బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ఒక టెకీ మృతి

banjara hills road accident
Highlights

మరో ఇద్దరు కోమాలోకి

ఓ యువకుడి నిర్లక్ష్యపు ర్యాష్ బైక్ డ్రైవింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అతివేగంగా బైక్ నడుపిన యువకుడు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న మరో బైక్ ను
ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎదురుగా వచ్చిన బైక్ పై వున్న భార్యాభర్తల్లో భర్త సంఘటన స్థలంలోనే చనిపోగా భార్య తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లింది. ప్రమాదానికి కారణమైన యువకుడికి కూడా తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లిపోయాడు.

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గింజుపల్లి రాజేంద్రప్రసాద్‌ యాక్సెంచర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి బంజారాహిల్స్‌ ఇందిరానగర్‌లో నివాసముంటున్నాడు. నిన్న ఆదివారం సెలవురోజు కావడంతో భార్యతో కలిసి గుడికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా అతి వేగంతో బైక్‌పై దూసుకొచ్చిన విజయ్‌ముదిరాజ్‌ వీరి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో రాజేంద్రప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందగా భార్య భువన తో పాటు ప్రమాదానికి కారణమైన విజయ్ కూడా తీవ్ర గాయాలపాలయ్యారు.   

వెంటనే స్థానికులు గాయాలతో పడివున్న భువన తో పాటు విజయ్ ని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిద్దరు కోమాలోకి వెళ్లిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న బంజా రాహిల్స్‌ ఎస్‌ఐ కె.ఉదయ్‌ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

 

loader