తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లేఖ  రాశారు. నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా చించోలి గ్రామంలోని సర్వే నెంబర్ 543, 544, 969 లోని అటవీ భూమిని వృత్తి విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుమారు 3.373 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఆమోదం తెలిపిందని బండి సంజయ్ అన్నారు. అటవీ భూములను డీనోటిఫై చేసిందే నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసమని చెప్పారు. అటువంటి భూమిని స్వార్ధ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం కేటాయించడం చట్ట విరుద్దమని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. 

ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను ప్రార్థనా స్థలాలకు కేటాయించడానికి వీల్లేదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ఆ ప్రయోజనాల కోసమే వినియోగించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అందుకు భిన్నంగా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించడం చట్టవిరుద్దమని అన్నారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా చించోలిలో ఈద్గాను నిర్మించడం ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అవుతుందని అన్నారు. 

రెండు హిందూ దేవాలయాలకు సమీపంలోనే ఈద్గా ప్రార్థనలకు భూమి కేటాయించడం ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకే అని భావించాల్సి వస్తోందన్నారు. ఓట్ల కోసం విద్యార్థుల ప్రయోజనాలను పక్కనపెట్టి ఒక మతానికి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడం స్వార్ధ రాజకీయాలకు పరాకాష్ట అని లేఖలో విమర్శించారు. ప్రభుత్వ భూములను మతపరమైన కార్యక్రమాలకు వినియోగించకూడదని స్పష్టమైన నిబంధనలున్నప్పటికీ ఆ భూములను ఈద్గా నిర్మాణానికి కేటాయించడం.. ఆ నిర్మాణ పనులను స్వయంగా ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు ఆ ప్రాంతానికి వెళుతుండటం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును బలి చేసే చర్యలను తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ,కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు బేఖాతారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. వృత్తి విద్య, నైపుణ్య అభివృద్ధి కోసం కేటాయించబడిన భూమిని అదే ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతోపాటు ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు. ప్రజాక్షేత్రంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.