Asianet News TeluguAsianet News Telugu

రేపు నిజామాబాద్‌లో బండి సంజయ్ పర్యటన.. ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై దాడి ఘటనపై సీరియస్..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) గురువారం(జనవరి 27) రోజున నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) పర్యటనలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Bandi sanjay Will Visit Nizamabad tomorrow
Author
Hyderabad, First Published Jan 26, 2022, 1:10 PM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) గురువారం(జనవరి 27) రోజున నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) పర్యటనలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్.. జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న బీజేపీ ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. తెలంగాణలో బీజేపీ నేతలపై దాడుల అంశంపై చర్చించారు. 

నిన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటనలో చోటుచేసుకున్న ఘటనపై బండి సంజయ్ సీరియస్‌ అయ్యారు. బీజేపీ నేతలపై దాడుల నేపథ్యంలో భవిష్యత్తు కార్యచరణపై కూడా చర్చించారు. ఈ క్రమంలోనే రేపు నిజామాబాద్‌కు వెళ్లాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన కార్యకర్తల్ని , నేతలను బండి సంజయ్ పరామర్శించనున్నారు. 

నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) వాహనంపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేయడంపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను ప్రజలు పాలించడానికి ఎన్నుకున్నారా? లేక గూండాయిజం చేయడానికి ఎన్నుకున్నారా? అని ప్రశ్నించారు. డీజీపీకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, హోం గార్డును బదిలీ చేసే అధికారం కూడా డీజీపీకీ లేదా? అని ప్రశ్నించారు. సీపీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. తెలంగాణలో భిన్నమైన పాలన కొనసాగుతుందని అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా తెలంగాణలో పాలన ఉందని ఆరోపించారు. 

ఇక, నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి అరవింద్‌ వాహనంపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఆయన నందిపేట మండలం (Nandipet mandal) నూత్‌పల్లిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు వెళ్తుండగా ఆర్మూరు మండలం ఇస్సపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో అరవింద్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో పలువరు బీజేపీ నాయకులు, కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆర్మూరులో బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై అరవింద్ మాట్లాడుతూ.. నందిపేట్ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు తమను అడ్డుకున్నారని చెప్పారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు వేసి కాల్చారని తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్రను పోషించారని ఆరోపించారు. పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios