హైదరాబాద్: ప్రజలు ప్రచారానికి రాకుండా అడ్డుకొనే పరిస్థితి ఉండడంతో వరద సహాయం నిలిపివేయాలని తాను ఎస్ఈసీకి లేఖ రాశానని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

శుక్రవారం నాడు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

ఈ విషయమై తాను భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తానని తాను కేసీఆర్ కి సవాల్ చేసినట్టుగా చెప్పారు.ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు గాను తాను ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చినట్టుగా ఆయన వివరించారు.

కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టేందుకు తమపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన తెలిపారు. వరద సహాయం అందలేదని ప్రజలు ప్రచారానికి రాకుండా అడ్డుకొంటున్నందున టీఆర్ఎస్ నేతలు  తమపై బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు.

also read:కేసీఆర్‌కి సవాల్: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొన్న బండి సంజయ్

తమ పార్టీ అభ్యర్ధిని మేయర్ గా గెలిపిస్తే వరద భాదితులకు రూ. 25 వేలు అందిస్తామన్నారు. అంతేకాదు వరద నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పారు.డబుల్ బెడ్ రూమ్, ఎల్ఆర్ఎస్ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.

మతం పేరుతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓ వర్గం ఓట్లతో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. ఎంఐఎంతో లాలూచీ పడిన పార్టీ టీఆర్ఎస్ అని ఆయన విమర్శించారు.జీహెచ్ఎంసీలో తమకు అనుకూలంగా ఉందని తెలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.అబద్దాలు చేసే ప్రయత్నాన్ని కేసీఆర్ ఆపాలని ఆయన కోరారు.