లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్: బండి సంజయ్
లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్ కానుందని బీజేపీ విమర్శించింది. కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీజేపీకి సంబంధం లేదని బండి సంజయ్ చెప్పారు.
హైదరాబాద్: లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్ కాబోతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు బండి సంజయ్ బుధవారంనాడు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. లిక్కర్ స్కాం దోషులెవరినీ మోడీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
లిక్కర్ స్కాంలో కవిత వికెట్ అవుట్ అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ వికెట్లన్నీ క్లీన్ బౌల్డ్ కాబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. లిక్కర్ దందా చేస్తూ తెలంగాణ తల వంచదని కవిత చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ కూతురు కారణంగా తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి నెలకొందన్నారు.
కవిత దొంగ దందాలతో తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ప్రజల కోసం కవిత ఈ దొంగ దందా చేశారా అని ఆయన ప్రశ్నించారు. ఈ దొంగసొమ్ముతో రుణమాఫీ చేస్తున్నారా అని ఆయన అడిగారు. కేసీఆర్ బిడ్డ చేస్తున్న దొంగ దందాలతో తెలంగాణ తలవంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
తెలంగాణలో మహిళలకు అడుగడుగునా అవమానాలేనని ఆయన చెప్పారు.మహిళలు ఇంకా వంట గదికే పరిమితం కావాలనుకోవద్దని ఆయన కోరారు. వంటలు చేసే యాదమ్మ మోదీకే వండి పెట్టిందన్నారు.. గంగమ్మ వంటి వాళ్లు ఈరోజు టీవీల్లో యువతతో పోటీ పడుతున్నాదరని ఆయన గుర్తు చేశారు.
also read:ఈడీ స్పందన తర్వాతే ఢిల్లీ టూర్ పై కవిత నిర్ణయం
ప్రీతి ఘటన విషయంలో మీ పోరాటం భేష్ అని ఆయన మహిళా మోర్చా నాయకులను బండి సంజయ్ అభినందించారు. కేసీఆర్ బిడ్డ వాచీ విలువ రూ.20 లక్షలు అని ఆయన చెప్పారు.. కానీ, ప్రీతి చనిపోతే రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని చెప్పారు. కేసీఆర్ పొరపాటున మళ్లీ సీఎం అయితే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసేవాళ్లకు ప్రోత్సహకాలు ఇస్తారేమోనని ఆయన ఎద్దేవా చేశారు...
కవితే బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయన్నారు. గతంలో బతుకమ్మ ఎలా ఆడారు.... ఇప్పుడు ఎలా ఆడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బతుకమ్మ పేరుతో డిస్కోలు ఆడించి తెలంగాణ సంస్కృతినే దెబ్బతీసిన వ్యక్తి కవిత అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పాలనలో బతుకమ్మకే గౌరవం లేదదన్నారు. ఇక సాధారణ మహిళలకేం గౌరవం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.