హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్టుల పేరుతో కరోనా వైరస్ మీద ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి మర్కజ్ కారణమని ఆయన విమర్శించారు. వారణాసి నుంచి వచ్చనవాళ్లను కేసీఆర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేశారని, మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్తే మర్కజ్ నుంచి వచ్చినవాళ్లను అనుమతించారని ఆయన అన్నారు. 

ఓవైసీ పరోక్షంగా ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను జాతీయాధ్యక్షుడు జేపి నడ్డా మార్చి 11వ తేదీన నియమించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా సంజయ్ పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టలేకపోయారు. బుధవారంనాడు బిజెపి నేతల సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు కూడా తాము సహకరించామని ఆనయ చెప్పారు. భవిష్యత్తులో కూడా సహకరిస్తామని చెప్పారు. వైద్యం, లాక్ డౌన్ అణలుకు సేవ చేయడానికి తమ పార్టీ కార్యకర్తలు ముందు వరుసలో ఉంటారని ఆయన చెప్పారు.

తెలంగాణలో కరోనా పరీక్షలు తగ్గించడంతో కేసుల సంఖ్య తగ్గిందని సంజయ్ అన్నారు. ఐసిఎంఆర్ ఎక్కడా పరీక్షలు తగ్గించాలని చెప్పలేదని అన్నారు. మృతదేహాలకు కూడా పరీక్షలు చేయవద్దని ఎలా ఆదేశాలు ఇస్తారని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిఎంఈ సర్క్యులర్ ఎలా జారీ చేస్తారని అడిగారు. ప్రతి రోజు 2 వేల మందికి టెస్టులు చేసే అవకాశం ఉన్నా కూడా చేయడం లేనది ఆయన అన్నారు. ఎవరి వల్ల కరోనా వచ్చిందో అర్థం చేసుకోవాలని, హైదరాబాదు పాతబస్తీలో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారని ఆయన అన్నారు. 

రికార్డుల కోసం, రివార్డుల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన విమర్శించారు. వైరస్ మహమ్మారిని తగ్గించడానికి ప్రభుత్వం పని చేస్తోందా, పేరు కోసం పరీక్షలు చేయడం ఆపేస్తారా అని ఆయన అడిగారు. అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అనాలోచితంగా ముందుకు వెళ్తోందని ఆయన తప్పు పట్టారు. 

కేంద్రం ఇచ్చిన నివేదికల్లో రాష్ట్రంలో 26 మంది మరణించినట్లుగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం 25 మంది మరణించినట్లు చూపిస్తోందని ఆయన అన్నారు. కరోనా పాజిటివ్ కేసులను దాచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన అడిగారు.