న్యూఢిల్లీ: సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై బిజెపి రాష్ట్ర ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. సీఏఏను వ్యతిరేకిస్తే దేశ ద్రోహమా అని కేసీఆర్ వేసిన ప్రశ్నపై స్పందిస్తూ అవును, దేశద్రోహమేనని వారన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ కేసీఆర్ ప్రసంగించడం దేశద్రోహమేనని వారు అభిప్రాయపడ్డారు. 

సీఏఏపై తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వారిద్దరు సోమవారం ఢిల్లీలో స్పందించారు. కేసీఆర్ వాడిన భాషపై వారు తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

Also Read: దేశ ద్రోహులమౌతామా ?.. సీఏఏ పై అసెంబ్లీలో కేసీఆర్

పౌరసత్వం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఆయన చెప్పారు. పొరుగు దేశాల్లో మత హింసకు గురైన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులకు పౌరసత్వం ఇవ్వకూడదని కేసీఆర్ అంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్పీఆర్ ను వ్యతిరేకించే కేసీఆర్ తెలంగాణలో సమగ్ర సర్వే ఎందుకు నిర్వహించారని సంజయ్ అడిగారు. తెలంగాణ రాష్టర్ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం చెత్త కాగితంతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. 

నిజామాబాద్ ఆర్డీవోకు దరఖాస్తు చేసుకుంటే కేసీఆర్ కు బర్త్ సర్టిఫికెట్ ఇస్తారని ధర్మపురి అరవింద్ వ్యంగ్యంగా అన్నారు. తమకు గడీలు ఉండేవని చెప్పుకనే కేసీఆర్ కు తన పుట్టిన వివరాలు తెలియవా అని ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినంత మాత్రాన సీఏఏ అమలు కాకుండా పోదని ఆయన అయన అన్నారు. 

Also Read: సిఏఏ వ్యతిరేక తీర్మానం ప్రతులు చించేసిన రాజాసింగ్: అసెంబ్లీలో ఆందోళన

ఎవరైనా విధిగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు లేకపోతే రేపు ఓటుహక్కు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజాసింగ్ అసలు సిసలు భారతీయుడని ఆయన అన్నారు.