బీసీలకు క్షమాపణలు చెప్పాలి: మోడీపై రాహుల్ వ్యాఖ్యలపై బండి సంజయ్
సూరత్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను బీజేపీ తప్పుబట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయమై స్పందించారు.
న్యూఢిల్లీ: సూరత్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళన చేయడమంటే కోర్టు ధిక్కారమేననే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.
2019లో మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు నిన్న రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనలపై బండి సంజయ్ స్పందించారు.
శుక్రవారంనాడు న్యూఢిల్లీలో బీజేపీఎం ఎంపీ లక్ష్మణ్ తో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ వ్వవహరశైలి వల్లే ఆ పార్టీ బలహీనపడిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ప్రధానిని గౌరవించకుండా దొంగ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పుబట్టారు. ఇతర దేశాలకు వెళ్లి భారత్ ను కించపర్చేలా మాట్లాడి దేశ ప్రతిష్టను రాహుల్ గాంధీ మంటగలిపారని బండి సంజయ్ విమర్శించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మోడీకి క్షమాపణలు చెప్పాలని ఆయన రాహుల్ గాంధీని కోరారు. అంతేకాదు అంతేకాదు ఓబీసీ జాతికి కూడా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును శిరసావహించకపోతే ప్రజలు రాహుల్ గాంధీని దేశ పౌరుడిగా కూడా గుర్తించరన్నారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతారో అర్ధం కావడం లేదన్నారు.
రాహుల్ గాంధీకి న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదని బండి సంజయ్ చెప్పారు. మోడీని కించపర్చేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని సంజయ్ గుర్తు చేశారు. ఇలా వ్యాఖ్యానించినందుకే కోర్టు రాహుల్ గాంధీకి శిక్ష వేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం తమ జాగీరులా కాంగ్రెస్ పార్టీ ఫీలవుతుందన్నారు.మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతుందన్నారు.
also read:‘శూర్పణఖ’ వ్యాఖ్యలపై ప్రధాని మోడీపై పరువునష్టం దావా వేయనున్న రేణుకా చౌదరి..
బీసీలను కాంగ్రెస్ పార్టీ అణగదొక్కుతుందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం మోడీ అనేక పథకాలను తీసుకువచ్చారని డాక్టర్ లక్ష్మణ్ గుర్తు చేశారు. 20 మంది బీసీలకు మోడీ కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారని లక్ష్మణ్ చెప్పారు. తన లాంటి సామాన్య కార్యకర్తకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించారని లక్ష్మణ్ గుర్తు చేశారు. బీసీలకు పార్టీలో , ప్రభుత్వంలో మోడీ పెద్దపీట వేస్తే కాంగ్రెస్ కు కడుపుమంటగా ఉందని లక్ష్మణ్ విమర్శించారు.