అరెస్ట్ సమయంలో నా భర్తకు గాయాలు...: బండి సంజయ్ భార్య అపర్ణ ఆందోళన
అర్ధరాత్రి తమ ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు తన భర్త బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంపై బండి అపర్ణ స్పందించారు.
కరీంనగర్ : పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ తో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అర్థరాత్రి కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్ట్ చేసారు. బండి సంజయ్ ను కాళ్లు చేతులు పట్టుకుని బలవంతంగా ఇంటిబయటకు ఎత్తుకురావడంతో ఆగ్రహించిన బిజెపి శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా ఎలాగోలా సంజయ్ ను వాహనంలో ఎక్కించుకుని తరలించారు.
ఇలా అర్దరాత్రి ఇంట్లోకి చొరబడి మరీ తన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంపై బండి అపర్ణ స్పందించారు. పోలీసులు తన భర్తతో చాలా దారుణంగా వ్యవహరించారని... కనీస మానవత్వం లేకుండా ట్యాబ్లెట్స్ కూడా వేసుకునే అవకాశం ఇవ్వలేదని అన్నారు. కనీసం మంచినీళ్ళు కూడా తాగనివ్వకుండా బలవంతంగా ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చారని అపర్ణ తెలిపారు.
ఎందుకు అరెస్టు చేస్తున్నారు? వారెంట్ వుందా? అంటూ తన భర్త ప్రశ్నించినా పోలీసులు ఏ సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించారని అపర్ణ అన్నారు. ఇలా బలవంతంగా తీసుకుని వెళుతుండగా సంజయ్ ముఖానికి గాయమైనట్లు అపర్ణ తెలిపారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు కూడా ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించినా పట్టించుకోకుండా పోలీస్ వాహనంలో ఎక్కించి బండి సంజయ్ ను తరలించారని ఆయన బార్య అపర్ణ వెల్లడించారు.
Read More పెంబర్తి వద్ద బండి సంజయ్ ను తరలిస్తున్న కాన్వాయ్ అడ్డగింత: ఉద్రిక్తత
తన తల్లి చిన్న కర్మ కార్యక్రమంలో సంజయ్ పాల్గొనకుండా చేసారని అపర్ణ ఆవేదన వ్యక్తం చేసారు. భర్త సంజయ్ తో కలిసి తన తల్లి చిన్నకర్మ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వుందని... ఈ విషయాన్ని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని అపర్ణ అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తన భర్తను వెంటనే విడుదల చేయాలని అపర్ణ డిమాండ్ చేసారు.
ఇదిలావుంటే గత రాత్రి అరెస్ట్ చేసిన బండి సంజయ్ ను పోలీసులు గాజుల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో బిజెపి నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనలు చేపట్టారు. ఇలా సంజయ్ కోసం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Read More సంజయ్ టెర్రరిస్టా, నక్సలైటా..? ఇంత దారుణంగా అరెస్టా? : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఇక గాజుల రామారం పోలీస్ స్టేషన్ నుండి సంజయ్ ను తరలిస్తుండగా బిజెపి శ్రేణులు అడ్డుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పెంబర్తి వద్ద సంజయ్ ను తరలిస్తున్న పోలీస్ వాహనాలను బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే బిజెపి కార్యకర్తలు, పోలీసులకు మద్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టడంతో పెంబర్తి వద్ద ఉద్రిక్తత నెలకొంది.