Asianet News TeluguAsianet News Telugu

పాప దొరికింది: పోలీసుల ఎత్తుకు కిడ్నాపర్ చిత్తు, కోఠి నుండి బీదర్ వరకు దర్యాప్తు ఇలా...

పోలీసుల  దెబ్బకు కిడ్నాపర్ చిత్తు: బీదర్‌లో దొరికిన చిన్నారి

baby kidnap:Success of Karnataka, telangana police searching operation


హైదరాబాద్:కోఠి ప్రభుత్వాసుపత్రి నుండి కిడ్నాపైన చిన్నారిని ఒక్క రోజు వ్యవధిలోనే ఆచూకీ కనుక్కోవడంలో తెలంగాణ పోలీసులు విజయవంతమయ్యారు. సోమవారం మధ్యాహ్నం కోఠి ఆసుపత్రి నుండి కిడ్నాపైన చిన్నారి బీదర్ ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం నాడు దొరికింది. తన కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని గుర్తించిన నిందితురాలు బీదర్ ప్రభుత్వాసుపత్రిలో పసిపాపను వదిలేసి వెళ్లిపోయింది.

సోమవారం నాడు  మధ్యాహ్నం చిన్నారికి టీకాలు వేయిస్తానని చెప్పి నీలం రంగు చీర కట్టుకొన్న ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసింది.  ఈ విషయమై బాధితురాలు విజయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు  కిడ్నాపర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఆసుపత్రిలోని సీసీ పుటేజీ ఆధారంగా  గాలింపు చేపట్టారు. అయితే ఆసుపత్రిలో ఒక్క సీసీటీవి పుటేజీలో మహిళ దృశ్యాలు కన్పించాయి.ఇతర కెమెరాల్లో ఆ దృశ్యాలు సరిగా రికార్డు కాలేదు.

ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిన మహిళ ఏయే మార్గాల్లో వెళ్లిందనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. సుమారు 200 సీసీటీవి పుటేజీలను పరిశీలించారు. అయితే ఎంజీబీఎస్ ‌కు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.

సోమవారం సాయంత్రానికి ఆ మహిళ ఎంజీబీఎస్‌ నుండి బీదర్ బస్సు ఎక్కినట్టుగా గుర్తించారు.  అయితే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుండి  బీదర్ కు వెళ్లిన బస్సుల డ్రైవర్లు, కండక్టర్ల సమాచారాన్ని సేకరించారు. ఆ మహిళ బీదర్ వెళ్తున్నట్టుగా గుర్తించిన వెంటనే కర్ణాటక పోలీసులను తెలంగాణ పోలీసులు అలర్ట్ చేశారు.

తెలంగాణ నుండి మూడు ప్రత్యేక పోలీసు బృందాలు వేర్వేరు మార్గాల ద్వారా బీదర్‌కు వెళ్లారు.  మంగళవారం నాడు ఉదయం హైద్రాబాద్ నుండి బీదర్ కు చేరుకొన్న పోలీసులు బస్సు డ్రైవర్లను విచారిస్తే నయా కమాన్ ప్రాంతంలో  ఓ మహిళ  పసిపాపతో దిగినట్టుగా చెప్పారు.

ఈ ప్రాంతంలో కర్ణాటక పోలీసుల సహాయంతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కానీ, మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. కానీ ఆ మహిళ బస్ స్టేషన్ సమీపంలోని మురికివాడ నుండి ఆటోలో వెళ్లినట్టుగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించారు.

ఆటో డ్రైవర్ ఆచూకీని తెలుసుకొని  విచారిస్తే నిందితురాలిని తాను తీసుకెళ్లినట్టు  చెప్పారు. అయితే నిందితురాలి ఫోటోను వాట్సాప్ ద్వారా కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేశారు. మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

పోలీసులు తన కోసం అన్వేషిస్తున్నారని నిందితురాలు గ్రహించి పసిపాపను వదిలేస్తే తాను తప్పించుకోవచ్చని భావించి ప్రభుత్వాసుపత్రిలో పసిపాపను వదలేసి వెళ్లిపోయింది. 

అయితే పసిపాపను ఆమె ఎందుకు కిడ్నాప్ చేసింది, ఆమె ఎవరనే విషయం మాత్రం ఇంకా పోలీసులు తేల్చలేదు.కానీ, ఆ నిందితురాలు ఎవరనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీదర్‌లో ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారించారు. కానీ పసికందును కిడ్నాప్ చేసింది వారు కాదని తేలిందని పోలీసులు చెబుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios