పటాన్ చెరులో అదృశ్యమైన బి.ఫార్మసీ విద్యార్ధిని క్షేమం: ఇంటికి చేరుకున్న రోషిణి
సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో అదృశ్యమైన బి.ఫార్మసీ విద్యార్ధిని రోషిణి సురక్షితంగా ఇంటికి చేరుకుంది. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంటానని రోషిణి తండ్రికి ఫోన్ చేసింది.
సంగారెడ్డి: జిల్లాలోని పటాన్ చెరు నుండి అదృశ్యమైన బి. ఫార్మసీ విద్యార్ధిని సురక్షితంగా మంగళవారం నాడు ఇంటికి చేరుకుంది. గీతం యూనివర్శిటీలో ఆమె బి. ఫార్మసీ చదువుతుంది. ఈ నెల 16వ తేదీన రోషిణి కాలేజీకి వెళ్తున్నట్టుగా చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయింది. అయితే ఈ నెల 22న తాను ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రికి రోషిణి ఫోన్ చేసింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బి. ఫార్మసీ విద్యార్ధిని రోషిణి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇవాళ రోషిణి ఇంటికి చేరుకుంది.
సంక్రాంతిని పురస్కరించుకొని కాలేజీకి సెలవులు ఇవ్వడంతో పటాన్ చెరులోని బాబాయి ఇంటికి రోషిణి వెళ్లింది. ఈ నెల 16న కాలేజీకి వెళ్తున్నట్టుగా చెప్పి ఆమె ఇంటినుండి వెళ్లిపోయింది. కానీ కాలేజీకి ఈ నెల 22వ తేదీ వరకు సెలవులు. రోషిని కన్పించకుండా పోయిన విషయమై పేరేంట్స్ కాలేజీకి ఫోన్ చేస్తే ఈ విషయం తెలిసింది. దీంతో రోషిణి అదృశ్యమైన విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోషిణి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే సమయంలో రోషిణి ఇంటికి చేరుకుంది. డిప్రెషన్ లో రోషిణి ఇంటి నుండి వెళ్లిపోయినట్టుగా భావిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుండి ఇప్పటివరకు రోషిణి ఎక్కడ ఉందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.