అసలే రొయ్యిల కథ బాగా తెలిసిన టీ కాంగ్రెస్ నేతలు అజహర్ కెప్టెన్సీలో బాగా ఆడుతారా లేదా హిట్ వికెట్ గా మారుతారా అనేది వేచి చూడాలి.
ఆటలో ఫిక్సింగ్ చేస్తే టీం నుంచి అవుట్ అవతారేమో కానీ రాజకీయాల్లో మాత్రం బాగానే రాణిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఫిక్స్ అవ్వాలో తెలిస్తేనే సీటు ఎక్కొచ్చు.
అందుకు ఉదహరణే టీం ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్. ఆయనను నమ్ముకున్న క్రికెట్ పొమ్మనా రాజకీయం మాత్రం రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించింది. ఎంపీ పదవినిచ్చి లోక్ సభలో కూర్చొబెట్టింది.
క్రికెటర్ గా , ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతగా అజహర్ దేశవ్యాప్తంగా సుపరిచితుడే. ఇక పక్కా హైదరాబాదీ అనే ఇమేజ్ ఏలాగూ ఉంది.
ఈ ఇమేజ్ హెచ్ సీసీ ఎన్నికలకు ఉపయోగపడకపోయినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాత్రం బాగానే ఉపయోగపడేలా ఉందని హస్తం పెద్దలు ఇప్పుడు భావిస్తున్నారట.
అందుకే తెలంగాణ లో మాంచి ఫామ్ లో ఉన్న సీఎం కేసీఆర్ ను క్లీన్ బౌల్డ్ చేయాలంటే అది అజహర్ కెప్టెన్సీలోనే సాధ్యమని నిర్ణయించేశారట.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అజహర్ కు ఇచ్చే యోచనలో అధిష్టానం కాస్త సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ నుంచి వార్తలొస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ లో అందరూ సీనియర్ నేతలే. జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల, కోమటరెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా ఉంది. కానీ, ఏం లాభం అందరూ ఒక్కతాటిపైకి వచ్చి నిలబడిన దాఖలాలు లేవు.
అసలే భావప్రకటన స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న పార్టీ కావడంతో అందరూ తమ భావాలను స్వేచ్ఛగా పంచుకుంటూ పార్టీ ని కావాల్సిన వెనక్కు నెడుతున్నారు.
అందుకే ఇంతమంది పెద్దలున్నా సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చే నాయకత్వం లేకుండా పోయింది. అందువల్లే మాజీ కెప్టెన్ అజహర్ ను రంగంలోకి దించాలని ఢిల్లీ నేతలు నిర్ణయించినట్లు ఉన్నారు.
అజహర్ కాస్త తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఈ పెద్ద నేతలు దారిలోకి వస్తారు. మైనారిటీలలో ఓటు బ్యాంకు అమాంతం పెరుగుతుంది. కేసీఆర్ కు చెక్ పెట్టొచ్చు .. ఇలా ఒక్క నిర్ణయంతో తీన్ మార్ స్టెప్పులేయోచ్చు అనేది ఢిల్లీలోని కాంగ్రెస్ నేతల ప్లాన్.
కానీ, అసలే రొయ్యిల కథ బాగా తెలిసిన టీ కాంగ్రెస్ నేతలు అజహర్ కెప్టెన్సీలో బాగా ఆడుతారా లేదా హిట్ వికెట్ గా మారుతారా అనేది వేచి చూడాలి.
