శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అద్భుతంగా దూసుకెళ్తున్నప్పటికీ.. ఇంకా మన సమాజంలో మూఢనమ్మకాలు మాత్రం పోవడం లేదు. నిరక్ష్యరాస్యులతో పాటు డాక్టర్లు, ఇంజనీర్లు, పీహెచ్‌డీలు చేసిన వారు సైతం దొంగ బాబాలు, స్వామిజీలను ఆశ్రయిస్తూనే వున్నారు.

మొన్నామధ్య చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉన్నత విద్యావంతులు ఓ కళాశాలకు కరస్పాండెంట్ స్థాయిలో వున్న తల్లిదండ్రులు స్వయంగా తమ కుమార్తెలను హత్య చేశారు. తమ బిడ్డలిద్దరూ తిరిగి వస్తారంటూ వారు చెప్పిన మాటలు విని దేశం నివ్వెరపోయింది.

తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ పేరు మోసిన డాక్టర్ శ్మశానంలో క్షుద్రపూజలు చేస్తూ జనానికి దొరికిపోయాడు. అసలే ఆగ్రహంతో వున్న జనం ఆయనకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

వివరాల్లోకి వెళితే .. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రియాంక క్లీనిక్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు సమీర్‌ రాయ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో రాజారాంనగర్‌ కాలనీలో గల శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేస్తున్నారు.

అనుమానం వచ్చిన స్థానికులు కొందరు అటువైపు వెళ్లి చూశారు. విషయం తెలియడంతో ఆగ్రహంతో డాక్టర్‌ను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కలకత్తాకు చెందిన సమీర్‌రాయ్‌ కుటుంబం పదిహేనేళ్ల క్రితం ఇక్కడకు వలస వచ్చింది. తమ ఇంట్లో తరచూ కలహాలు చోటు చేసుకుంటుండడంతో పురోహితుని సలహా మేరకు పూజలు చేసి నట్లు సమీర్‌ రాయ్‌ చెప్పారు.