భైంసా: తమకు ఇష్టంలేని ప్రేమ పెళ్లి చేసుకుందని సొంత చెల్లితో పాటు ఆమె భర్తను హతమార్చడానికి ముగ్గురు యువకులు ప్రయత్నించారు. ఈ ప్రేమ జంట ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేశారు. ఈ దారుణం నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... నిర్మల్ జిల్లాలోని బైంసా పట్టణానికి చెందిన నాగజ్యోతి, అక్షయ్ గతకొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు యువతి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోయినా గతేడాది పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ దంపతులపై కక్ష పెంచుకున్న కుటుంబసభ్యులు తాజాగా వారిని హతమార్చడానికి ప్రయత్నించారు. 

బుధవారం కుంటాల మండలం కల్లూరులో డిగ్రీ పరీక్ష రాసిన నాగజ్యోతిని తీసుకెళ్లడానికి అక్షయ్ వెళ్లాడు. దంపతులిద్దరు కలిసి బైక్ పై ఇంటికి తిరిగి వెళుతున్న విషయం తెలిసిన యువతి సోదరులు ఓ కారులో వచ్చి బైక్ ను ఢీకొట్టారు. దీంతో ఈ ప్రేమజంటకు తీవ్ర గాయాలయ్యారు. అంతటితో ఆగకుండా అప్పటికే గాయాలపాలైన అక్షయ్ ని కర్రతో చితకబాదారు. 

తీవ్ర గాయాలతో ప్రస్తుతం పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రేమజంట చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.