వనపర్తిలో దారుణం.. సొంత అన్నను నరికి చంపిన తమ్ముళ్లు.. ఆస్తి వివాదాలే కారణం..
సోదరుల మధ్య తలెత్తిన ఆస్తి వివాదం వారిలో ఒకరి ప్రాణాలను బలిగొంది. సొంత తమ్ముళ్లే.. తోడ బుట్టిన అన్నను దారుణంగా హతమార్చారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వారందరూ తోడబుట్టిన అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. పెద్దయి ఎవరికి వారు బతుకుతున్నారు. కానీ ఆస్తి కోసం తలెత్తిన వివాదంలో సొంత అన్ననే తమ్ముళ్లు నడిరోడ్డుపై నరికి చంపారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి మండలం రాజపేట పెద్దతండాలో మంగ్లీ- పూల్య నాయక్ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఐదుగురు కొడుకులు ఉన్నారు. పూల్య నాయక్ కు 20 ఎకరాల భూమి ఉండేది. దానిని ఐదుగురు పిల్లలకు సమానంగా పంచేశాడు.
ఈ దంపతుల రెండో కొడుకు 51 ఏళ్ల బద్రీనాథ్ వీపనగండ్లలో ఏపీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే బద్రీనాథ్ కు మగ బిడ్డ లేడు కాబట్టి.. తండ్రి ఇచ్చిన ఆస్తిని తిరిగి సోదరులకు ఇచ్చేయాలని ఆ కుటుంబంలో ప్రతిపాదన వచ్చింది. దీనికి బద్రీనాథ్ ఒప్పుకోలేదు. దీంతో భూమిని తనకు తిరిగి ఇచ్చేయాలని పూల్య నాయక్ డిమాండ్ చేశారు. దీంతో ఆయన కోర్టుకు వెళ్లారు.
దీంతో అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. అవి వారి మధ్య వివాదానికి దారి తీసింది. ఈ ఆస్తి వివాదం కోర్టులో పది సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అన్నదమ్ములు చాలా సార్లు గొడవపడ్డారు. దీంతో సోదరుల నుంచి తనకు ప్రాణభయం ఉందని బద్రీనాథ్ భావించారు. అందుకే కొంత కాలం నుంచి హతీరాం అనే వ్యక్తిని తన వెంటబెట్టుకొని బయట తిరుగుతున్నారు.
TS Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయ్!.. 15750 మందితో జాబితా..
తన విధుల్లో భాగంగా బద్రీనాథ్ బుధవారం కలెక్టరేట్ కు వచ్చారు. తిరిగి ప్రయాణం ప్రారంభించి మరికుంట సమీపంలోకి చేరుకున్నారు. అక్కడ తన ఇద్దరు సోదరులు సర్దార్ నాయక్, కోట్యా నాయక్ ఎదురు నిలిచారు. వీరితో పాటు సర్దార్ నాయక్ కొడుకు పరమేశ్ వెంట ఉన్నాడు. వీరంతా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బద్రీనాథ్ పై కత్తులతో దాడికి దిగారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హతీరాంకు కూడా కత్తితో గాయాలు అయ్యాయి. దీంతో అతడు భయంతో పారిపోయాడు. తరువాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.