జల్లికట్టుకు ఉమ్మడి పౌరస్మృతికి లింక్ పెట్టిన ఓవైసీ

జల్లికట్టు నిషేధంపై తమిళమంతా ఏకమై పోరాడుతోంది. మరోవైపు వారికి మద్దతుగా దేశవిదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.

న్యాయ స్థానం తీర్పు నుంచి తప్పించుకునేందుకు ఆర్డినెన్స్ కూడా సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ జల్లికట్టుపై తనదైన శైలిలో స్పందించారు.

భారత్ లో ఉమ్మడి పౌరస్మృతి కుదరనిపని ట్విటర్ లో పేర్కొన్నారు. దేశంలో వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేందుకు జల్లికట్టుపై తమిళనాడులో జరుగుతున్న ఉద్యమమే నిదర్శనమన్నారు.

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి తేవాలని గత కొద్దికాలంగా డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలసిందే. ముఖ్యంగా న్యాయస్థానాలే ఈ విషయంలో చాలా క్రీయాశీలకంగా ఉన్నాయి.

ఉమ్మడి పౌరస్మృతి పై కోర్టులు అనేక సార్లు కేంద్రానికి సూచించాయి కూడా. అయితే ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో ఈ తేనెతుట్టెను కదిపేందుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఒక్క గోవా రాష్ట్రంలోని ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉంది. మిగిలిన రాష్ట్రాలు దీనిపై చర్చించేందుకు కూడా సహసించడం లేదు.

ఇలాంటి సమయంలో అసద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన చెప్పినదానిని పూర్తిగా కొట్టేయలేం. అలాగే, ఉమ్మడి పౌరస్మృతిని జల్లికట్టుతో లింక్ పెట్టడాన్ని పూర్తిగా సమర్థించనూ లేము.

ఇంతకీ అసద్ ఈ వ్యాఖ్యలను చేసింది కోర్టులను ఉద్దేశించా... లేక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనా అనేది స్పష్టం చేయలేదు.