తెలంగాణ మంత్రి కేటీఆర్ మిలిటరీ కంటోన్మెంట్ విషయమై చేసిన వ్యాఖ్యలపై ఆర్మీ స్పందించింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని పేర్కొంది. నిజానికి ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవ దూరంగా ఉన్నాయని, ఇటీవలి కాలంలో సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ లీడర్షిప్ ఎలాంటి రోడ్లు మూసేయలేదని, దానికి సంబంధించి ఫిర్యాదులూ రాలేవని వివరించింది.

న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ పరిశీలించింది. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ అధికారులు రోడ్లను బ్లాక్ చేసి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒక వేళ ఆర్మీ అధికారులు ఇలాగే రోడ్లను మూసేయడం చేస్తే వారికి విద్యుత్, నీటి సరఫరానూ నిలిపేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ హెచ్చరికలు ఆర్మీ అధికారులను కలచి వేశాయి. ఈ నేపథ్యంలోనే ఆర్మీలోని సీనియర్ అధికారులు కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. ఇటీవలి కాలంలో కంటోన్మెంట్‌లోని లీడర్షిప్ ఎలాంటి రోడ్లను మూసేయలేదని, అలాగే, దీనికి సంబంధించి ఫిర్యాదులూ లేవని వివరించారు.

ఏసియానెట్ న్యూసేబుల్‌తో సీనియర్ ఆర్మీ అధికారులు ఈ విషయమై మాట్లాడుతూ, తెలంగాణలో ఉంటున్న ఆర్మీని, వారి కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు బాధను కలిగించాయని పేర్కొన్నారు. సికింద్రబాద్ కంటోన్మెంట్‌లో ఆర్మీ సిబ్బంది కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాత్రమే తాత్కాలికంగా పీస్ టెన్యూర్‌లో భాగంగా ఉంటారని వివరించారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి దేశ సార్వభౌమ, సమగ్రతను కాపాడే కీలక ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారని తెలిపారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో వారు విధులు నిర్వర్తించడానికి అక్కడి నుంచి వెళ్లిపోతారని అన్నారు.

కంటోన్మెంట్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని స్థానిక మిలిటరీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇటీవలే అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్‌లోని ఆర్మీ కంటోన్మెంట్‌ను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మిలిటరీ అధికారులు ఇక్కడ రోడ్లను మూసేస్తున్నారని అన్నారు. తద్వారా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని, స్థానిక ప్రజలకూ అంతరాయాలు కలుగుతున్నాయని తెలిపారు.

కానీ, కంటోన్మెంట్‌లోని మిలిటరీ లీడర్షిప్ మాత్రం కేటీఆర్ వ్యాఖ్యలను పరిశీలించి అందుకు విరుద్ధమైన భావనకు వచ్చాయి. ఇటీవలి కాలంలో ఆర్మీ ఎలాంటి దారులనూ మూసేయలేదని, అలాగే, అందుకు సంబంధించిన ఫిర్యాదులూ ఏమీ లేవని వివరించారు. అంతేకాదు, గణతంత్ర వేడుకల రోజునా కంటోన్మెంట్ రోడ్లు తెరిచే ఉన్నాయని కంటోన్మెంట్ వర్గాలు తెలిపాయి. గతేడాది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పర్యటించిందని, కంటోన్మెంట్ ఏరియాలో రోడ్లను ఓపెన్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించి సంతృప్తికరంగా వెనుదిరిగాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు సంబంధించినంత వరకైతే.. మిలిటరీ అధికారులు ఎలాంటి ఆటంకాలు కల్పించలేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచీ ఇంకా ఎలాంటి ప్రతిపాదనలూ తమకు రాలేదని వివరించాయి. అలాగే, ప్రతిపాదిత స్కైవాక్‌కు సంబంధించిన ప్రాజెక్టు విషయమై నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను అధికారులు సూచించారని, ఎందుకంటే ఇది ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టు అని తెలిపాయి. బల్కాపూర్ నాలా దగ్గరి చెక్ డ్యామ్‌ విషయంలోనూ జీహెచ్‌ఎంసీకి తాము అవసరమైన సహాయం చేస్తామని స్పష్టం చేసినట్టు పేర్కొన్నాయి.