హైదరాబాద్: మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి  మస్తాన్ వలీ యువతుల నగ్న వీడియోలు తీసి  బ్లాక్ మెయిల్ చేశాడు.  సుమారు 30 మంది యువతుల నగ్న వీడియోలను తీసి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లాకు చెందిన మస్తాన్ వలీ  2007లో హైద్రాబాద్‌కు వచ్చాడు.బీకాం పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం  ప్రయత్నించాడు. కానీ, అతడికి ఉద్యోగం దొరకలేదు. దీంతో మస్తాన్ వలీ సులభంగా డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.

ఈ క్రమంలోనే హైద్రాబాద్‌లోనే సంతోషి, రవి, నవనీతలు పరిచయమయ్యారు. వీరి పరిచయం కారణంగా  జాబ్ కన్సల్టెంట్ ఆఫీసులను ప్రారంభించారు. ఉద్యోగాల పేరుతో  జాబ్ కన్సల్టెంట్ కార్యాలయాలను బేగంపేట, విద్యానగర్ ప్రాంతాల్లో ప్రారంభించాడు.

ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతులకు వల వేసేవాడు. ఉద్యోగం కోసం వచ్చే యువతులను నగ్న వీడియోలను, ఫోటోలను తీసి  బ్లాక్ మెయిల్ దిగేవాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే  సోషల్ మీడియాలో నగ్న వీడియోలను పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు. 

ఈ నగ్న వీడియోలను చూపి సుమారు 30 మంది యువతులపై మస్తాన్ వలీ అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.మరోవైపు నకిలీ క్రెడిట్ కార్డులను తయారు చేసినట్టుగా కూడ మస్తాన్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో  మస్తాన్ వలీని రాచకొండ పోలీసులు  అరెస్ట్ చేశారు.