ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి రావాలో తెలియక అసెంబ్లీ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించిందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి రావాలో తెలియక అసెంబ్లీ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించిందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం నాడు అమరావతిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా నిబంధనలను పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఏ అంశంపైనా అయినా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ బండారం బయటపడుతోందనే భయంతో టీడీపీ అసెంబ్లీకి రానంటోందన్నారు. పక్క రాష్ట్రంలో ఉంటూ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతున్నారన్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
also read:ప్రభుత్వం కూలిపోతుందనే.. ఒకరోజు అసెంబ్లీ: అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
ఎంపీ రఘురామకృష్ణంరాజు గుంటూరు జైలు నుండి సికింద్రాబాద్ కు వెళ్లే సమయంలో మీసాలు తిప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రఘురామకృష్ణంరాజును పోలీసులు ఎందుకు కొడతారని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అనేక కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. తమ నేతలపై రాజద్రోహం కేసులు పెట్టారని ఆయన చెప్పారు. తిరుపతిలో కరోనా వ్యాప్తి చెందేలా చేసి పక్క రాష్ట్రానికి పారిపోయింది చంద్రబాబు, లోకేష్ కాదా అని ఆయన ప్రశ్నించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు చంద్రబాబుకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. సిగ్గుపడకుండా అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన విమర్శించారు. ప్రజల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
