ఏపీ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్చిలో అసెంబ్లీ పెట్టమంటే ముఖ్యమంత్రి కరోనా ఉందని చెప్పారని మండిపడ్డారు.

కానీ ఇప్పుడేమో తూతూమంత్రంగా ఒక్కరోజు సమావేశానికి పరిమితమయ్యారంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు. 900 కేసులున్నప్పుడు అసెంబ్లీ పెడితే, శాసనసభ్యుల ప్రాణాలకు ప్రమాదమని చెప్పిన వ్యక్తి, 2 లక్షల 16 వేల కేసులున్నప్పుడు సమావేశాలు ఎలా పెడుతున్నారని ఆయన నిలదీశారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ పెట్టాలని లేదంటే ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే జగన్ ఒకరోజు అసెంబ్లీకి సిద్ధమయ్యారంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు 150 రోజులు నిర్వహించాలని చెప్పిన జగన్, ఇప్పుడు ఒక్కరోజుకే పరిమితమవ్వడమేంటని అచ్చెన్నాయుడు నిలదీశారు.

Also Read:ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం.. చంద్రబాబు కీలక నిర్ణయం

కరోనా కట్టడి దృష్ట్యా, ప్రజల ప్రాణాలు కాపాడటానికి బాధ్యతగల ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించలేకపోయారని ధ్వజమెత్తారు. ప్రజలు బతికుండగా వారిని కాపాడటంచేతగాక, చనిపోయాక రూ.15వేలు ఇస్తానంటున్నాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

తూతూ మంత్రంగా, మొక్కుబడిగా అసెంబ్లీ నిర్వహించడం ఎంతవరకు ధర్మమో, న్యాయమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రజల ప్రాణాలు కాపాడటం చేతగాని ముఖ్యమంత్రి అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, టీడీపీ ఒక్కరోజు అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు.