భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష .. వారికి రూ.10వేలు ఇవ్వండి : అధికారులకు జగన్ ఆదేశాలు
రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు తిరిగి వెళ్లేటప్పుడు రూ.10 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పరిస్ధితిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జగన్ సూచించారు.

రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు తిరిగి వెళ్లేటప్పుడు రూ.10 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ మొత్తం వారికి కచ్చా ఇళ్లు నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుందని జగన్ పేర్కొన్నారు. శిబిరాల్లో వున్న వారికి అన్ని రకాల వసతులు కల్పించాలని.. ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కలెక్టర్లు మానవీయ కోణంతో వ్యవహరించాలని.. బాధితులకు బాసటగా నిలవాలని సూచించారు. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని.. సచివాలయాలు, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ వుంచుకోవాలని , లంక గ్రామాలకు జనరేటర్లు సిద్ధం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాగునీటికి కొరత లేకుండా చూసుకోవాలని.. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల్లో సరిపడా మందులను నిల్వ వుంచుకోవాలని సీఎం పేర్కొన్నారు.
Also Read: పోటెత్తిన మున్నేరు వరద, హైద్రాబాద్-విజయవాడ హైవే రేపటి వరకు మూసివేత: సీపీ కాంతిరాణా టాటా
కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలని.. అధికారులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిస్ధితిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జగన్ సూచించారు. భద్రాచలం వద్ద వరద ప్రవాహం పెరిగే అవకాశం వున్నందున అల్లూరి, ఏలూరు, తూర్పుగోదావరి , పశ్చిమ గోదావరి , అంబేద్కర్ కోనసీమ జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా వుండాలని సీఎం ఆదేశించారు.