హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఏపీ పోలీస్ విభాగానికి చెందిన ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ భవనాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం చెరి సగం కేటాయించింది. ఏపీ ప్రభుత్వం అమరావతి నుంచి పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో, ఉద్యోగులు కూడా అక్కడి వెలగపూడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాలని గవర్నర్ నరసింహన్‌‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కోరారు. 

హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకోవడం లేదు. దీంతో గవర్నర్ వాటిని తెలంగాణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భవనాల మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లించడం లేదని, ఏపీ భవనాలకు తామెలా చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా గవర్నర్ ఉత్తర్వులతో ఆ వివాదానికి తెర దించినట్లయింది.