ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు మరోసారి కుట్ర పన్నారు. నిజామాబాద్ లో జీవన్ రెడ్డి హత్య కోసం సేకరించిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళను అరెస్ట్ చేశారు.
నిజామాబాద్ : ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హత్యకు గతంలో కుట్రపన్నిన సంగతి తెలిసిన విషయమే. కాగా మరోసారి ఎమ్మెల్యేను హత్య చేయడానికి కుట్రపన్నిన ఉదంతం తాజాగా నిజామాబాదులో వెలుగు చూసింది. ఈ వ్యవహారం నిజామాబాదులో కలకలం రేపింది. గతంలో కుట్రపన్నిన నిందితుడు ప్రసాద్ గౌడ్ తాజాగా ఈ కుట్రకి సూత్రధారి అని తెలిసింది. నిరుడు ఆగస్టులో హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలోకి ప్రసాద్ గౌడ్ నేరుగా తుపాకీతో ప్రవేశించి.. జీవన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించాడు. అతనే ఈసారి మరో కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో భాగంగానే నిజామాబాద్ లోని కంఠేశ్వర్ హౌసింగ్ బోర్డు కాలనీలో బొంత సుగుణ(41) అనే నిందితురాలు ఇంట్లో నిల్వచేసిన గిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ లాంటి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిమీద నిజామాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్ గౌడ్ (43) గతంలో కూడా హత్యాయత్నం చేశాడు. 2022 ఆగస్టు నెలలో ఈ దారుణానికి తెగబడ్డాడు. నేరుగా హైదరాబాదులోని ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డాడు. తన వెంట తుపాకి తీసుకెళ్లాడు. అయితే అక్కడున్న భద్రతా సిబ్బంది అతడిని గుర్తించి పట్టుకున్నారు. ఆ తర్వాత అతని దగ్గర తుపాకీ ఉండడంతో అతడిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసాద్ గౌడ్ దగ్గర ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిజామాబాదుకు చెందిన బొంత సుగుణ అనే మహిళకు తుపాకీ కొనడం కోసం రూ. 60 వేలు.. ప్రసాద్ గౌడ్ ఆన్లైన్లో పంపినట్లుగా తెలిసింది. దీంతో ఆమెను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. ఆమెను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత నెల రోజులకు వీరిద్దరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. కాగా అప్పటినుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై వీరిద్దరూ పగ పట్టారు. తమ మీద తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించారని కక్షపెంచుకున్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర: హైద్రాబాద్ లో ఒకరి అరెస్ట్
ఎలాగైనా జీవన్ రెడ్డిని హత్య చేయాలని పథకం వేశారు. బొంత సుగుణ వృత్తిరీత్యా బ్లాస్టింగ్ పనుల్లో డ్రిల్లింగ్ చేస్తుంటుంది. దీన్నే జీవన్ రెడ్డి హత్యకు ఉపయోగించుకోవాలని అనుకున్నారు. అందుకే ఇద్దరు కలిసి వేర్వేరు వ్యక్తుల ద్వారా జిలెటిన్ స్టిక్స్ ను, డిటోనేటర్లను సేకరించాలనుకున్నారు. అలా జనవరి 9న 95 గిలెటిన్ స్టిక్స్, పది డిటోనేటర్లను వేరే వ్యక్తుల ద్వారా సంపాదించారు. అయితే వీరు జీవన్ రెడ్డి హత్య పథకాన్ని అమలు చేయడానికంటే ముందే, ఓ కేసులో ప్రసాద్ గౌడ్ అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
మాక్లూర్ మండలంలో వినోద్ అనే వ్యక్తిపై ప్రసాద్ గౌడ్ కత్తితో దాడి చేశాడు. దీంతో అతడు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై మరోసారి హత్యకు కుట్ర పన్నుతున్నాడని పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అంతకుముందు కేసులో నిందితురాలుగా ఉన్న బొంత సుగుణ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
కంఠేశ్వర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సుగుణ ఇంట్లో శుక్రవారం నాడు తనిఖీలు నిర్వహించగా పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. దీంతో సునీతను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు ప్రసాద్ గౌడ్ మరోసారి కుట్రపనినట్లుగా తెలియజేసింది. దీనికోసం ప్రసాద్ గౌడే గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా పేలుడు పదార్థాలను తనకు పంపించాడని ఒప్పుకుంది. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 37 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బొంత సుగుణ ఏ1గా, ప్రసాద్ గౌడ్ ఏ2లుగా చేర్చారు. అయితే ప్రసాద్ గౌడ్ ఇప్పటికే జైలులో ఉన్నాడు. హత్య కుట్రకు యత్నం వెలుగులోకి రావడంతో సుగుణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
