విద్యార్హతల నేపథ్యంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు నకిలీవని ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. అర్వింద్ ఈసీని తప్పుదోవ పట్టించారని, తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. తాజాగా ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కొందరు గురువారం తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయెల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఆయన విద్యార్హతలపై దర్యాప్తు జరపాలని కోరడంతో పాటు ఇందుకు అవసరమైన పత్రాలను ఈసీకి అందజేశారు. నిజామాబాద్ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన అరవింద్ తాను రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో పీజీ చేసినట్లుగా అఫిడవిట్ సమర్పించారు.

అయితే ఆయన రాజస్థాన్‌లో ఎలాంటి విద్యను అభ్యసించలేదని.. దొంగ సర్టిఫికేట్ వివాదంలో ఇరుక్కున్న ఒక సంస్థ నుంచి పీజీ సర్టిఫికేట్‌ను కొన్నారని టీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపించడం సంచలనం సృష్టించింది.