దుబ్బాక: ఉపఎన్నికలకు సిద్దమైన దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరికి చేదు అనుభవం ఎదురయ్యింది. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ దుబ్బాకలో జరిగిన ఓ కార్యక్రమంలో తీవ్ర అసహనానికి గురయి ఓ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఎమ్మెల్యేకు ఎదురుతిరిగి బాధితుడికి క్షమాపణ చెప్పించే వరకు వదిలిపెట్టలేదు. 

వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిధిలోని వెంకట్రావుపేట గ్రామంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పర్యటించారు. ఈ క్రమంలో ఆయన వెంట మండల అధ్యక్షులు మల్లారెడ్డి కూడా వెళ్లగా గ్రామానికి చెందిన కనకరాజు అనే కార్యకర్త అతడితో వాగ్వాదానికి దిగాడు. పార్టీ కార్యకర్తను అయిన తనకు పార్టీ సభ్యత్వం ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశాడు. 

ఆ బిల్లును తేనే పూసిన కత్తి అంటారా: కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు

ఈ క్రమంలో అతన్ని ఎమ్మెల్యే సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే అతడిపై చేయిచేసుకున్నారు. దీంతో గ్రామస్తులంతా బాధితుడికి అండగా నిలిచి ఎమ్మెల్యేను ఘెరావ్ చేశారు. తమ ఊరికి వచ్చి తమవాడినే కొడతారా అంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో దిగివచ్చిన క్రాంతికిరణ్ బాధితుడికి క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. 

సమావేశంలో గొడవ జరగకుండా తాను కనకరాజు భుజంపై చేయి వేసి సముదాయించానని... దీంతో గ్రామస్తులు అపార్థం చేసుకుని అతడిపై దాడి చేశానని అనుకున్నారని క్రాంతికిరణ్ పేర్కొన్నారు. తాను అతడిపై చేయి చేసుకోలేదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.