Asianet News TeluguAsianet News Telugu

ఎపి నిరుద్యోగులకు శుభవార్త.. మరి తెలంగాణ వాళ్లకు ?

  • ఎపిలో రెండో డిఎస్సీ విడుదల
  • డిఎస్సీ 2018 ప్రకటన జారీ చేసిన సర్కారు
  • తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళన
  • ఇప్పటివరకు ఒక్క టీచర్ పోస్టు భర్తీ కాని వైనం
Andhra is on the recruitment spree while Telangana youth languish jobless

విభజన తర్వాత ఎపి సర్కారు ఒక డిఎస్సీ నిర్వహించి సుమారు 10వేల మందికి టీచర్ కొలువులిచ్చింది. తాజాగా మరో డిఎస్సీని ఎపి ప్రభుత్వం ప్రకటించింది. 12370 పోస్టులతో డిఎస్సీ 2018 ప్రకటన జారీ చేశారు ఆ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు 2018 జూన్ 12 నాటికి డిఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి కొత్త ఉపాధ్యాయులను బళ్లకు పంపుతామని ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చుతామని మంత్రి గంటా మీడియా సమావేశంలో ప్రకటించారు. లోటు బడ్జెట్ తో ఉన్నామని చెప్పుకుంటూనే ఆంధ్రప్రదేశ్ లో రెండో డిఎస్సీ వేయడం చర్చనీయాంశమైంది. నిరుద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది.

తెలంగాణలో ఇప్పటివరకు తెలంగాణ సర్కారు డిఎస్సీ విషయంలో నిరుద్యోగులను ఆశలపల్లకీలో ఊరేగిస్తూనే ఉన్నది. 42నెలలుగా డిఎస్సీపై సర్కారు దాగుడుమూతలు ఆడుతూనే ఉన్నది. అదిగో డిఎస్సీ, ఇదిగో డిఎస్సీ అంటూ ప్రకటనలు చేయడం తర్వాత వెనక్కు తగ్గడంతో నిరుద్యోగులు ఉసూరుమంటున్నారు. తెలంగాణలో సుమారు 5 లక్షల మంది టీచర్ అభ్యర్థులు డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి కోచింగ్ లు తీసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.

సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో హడావిడిగా డిఎస్సీని మూలకు పడేసి టిఆర్టిని ముందుకు తెచ్చింది తెలంగాణ సర్కారు. తొలి కేబినెట్ నుంచి 16వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతూ కేవలం 8వేల పోస్టులకు టిఆర్టి ప్రకటన చేశారు. అది కూడా కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల భర్తీ అనడంతో హైకోర్టు మొట్టికాయలేసింది. పాత జిల్లాల ప్రకారం సవరించి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరింది. అయితే కాలయాపన కోసమే కొత్త, పాత జిల్లాల వివాదాన్ని సర్కారే ముందుకు తెచ్చిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సవరణ నోటిఫికేషన్ లో అయినా మొత్తం ఖాళీ పోస్టులకు ప్రకటన ఇస్తారేమోనని అభ్యర్థులు ఎదురుచూశారు. కానీ అలాంటిదేమీ లేకుండా 8వేల పోస్టులకే సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు.

మొత్తానికి తెలంగాణలో మిగులు బడ్జెట్ రాష్ట్రం అని చెప్పుకుంటునన్న తరుణంలో 42నెలల కాలంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోవడం ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. వేలకు వేలు కోచింగ్ ఫీజులు, హాస్టల్ ఫీజులు చెల్లించి ప్రిపేర్ అవుతున్నా సర్కారు పట్టించుకోవడంలేదని నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఒకవైపు నిరుద్యోగులు ఉద్యోగాలు రావడంలేదని ఆత్మబలిదానాలకు పాల్పడుతూ ఆందోళన కలిగిస్తున్నారు. ఇంకోవైపు కొలువుల కొట్లాట పేరుతో ఉద్యోగాల భర్తీ కోసం జెఎసి తీవ్రమైన వత్తిడి తెస్తున్నది. అయినప్పటికీ తెలంగాణ సర్కారు ఎందుకనో టీచర్ పోస్టుల భర్తీ పట్ల అంతగా సుముఖంగా లేనట్లు కనబడుతున్నది. అందుకే అదిగో ఇదిగో... అంటూ ప్రకటనలతోనే నిరుద్యోగులను ఊరిస్తున్నది తప్ప ఇప్పటి వరకు వారిలో విశ్వాసం కల్పించేలా టీచర్ పోస్టుల ప్రకటన జారీ చేయలేదు.

తాకత్ లేదు.. చిత్తశుద్ధి లేదు : భీంరావు నాయక్

తెలంగాణలో నిధులు లేకపోవడంతోపాటు డిఎస్సీ వేయాలన్న చిత్తశుద్ధి లేకనే డిఎస్సీ వేయకుండా కాలయాపన చేస్తున్నారని విద్యార్థి జెఎసి ఛైర్మన్ భీంరావు నాయక్ విమర్శించారు. ఆయన ఏషియానెట్ తో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుకు తాకత్ లేదు అందుకే డిఎస్సీ వేయడంలేదన్నారు. ఉన్న డబ్బంతా మిషన్ భగీరథ, కాకతీయకు మళ్లించి కమిషన్లు కొట్టేశారని ఆరోపించారు. దీంతో టీచర్ పోస్టులు వేయాలంటే నిధులు సరిపోతలేవన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ స్టేట్ కాదు పాడు కాదు.. అప్పుల రాష్ట్రంగా ఎప్పుడో మారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టెట్ వేశారు. తెలంగాణలో రెండు టెట్ లు వేశారు. కానీ ఐదేళ్లుగా తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ లేనే లేదని ఆరోపించారు. తెలంగాణలో టీచర్ పోస్టుల ఖాళీలు 34వేలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మూసివేసిన పాఠశాలలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు మూడుసార్లు వార్నింగ్ ఇచ్చినా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కోర్టు మెడమీద కత్తి పెట్టిందన్న భయంతోనే టిఆర్టి పేరుతో ఉత్తుత్తి ప్రకటన జారీ చేశారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చినా.. జిల్లాల గెజిట్ లేనందున నోటిఫికేషన్ కోర్టులో పనికిరాకుండాపోయిందన్నారు. తెలంగాణ పాలకులకు టీచర్ పోస్టులు వేయాలన్న కమిట్ మెంట్ ఏమాత్రం లేదన్నారు. అందుకే కాలయాపన చేస్తున్నారని తెలిపారు.

టైం ప్రకారం పూర్తి చేయాలి : ఆంధ్రా టీచర్ అభ్యర్థి

ఎపిలో నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల టీచర్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండో నోటిఫికేషన్ జారీ చేశారు కానీ.. వెంటనే షెడ్యూల్ ప్రకారం టీచర్ పోస్టుల భర్తీ పూర్తి చేయాలని గుడివాడకు చెందిన రామారావు అనే డిఎస్సీ అభ్యర్థి ఏషియానెట్ కు తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios