వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. ఈనెల 18వ తేదీన ఆమ్రపాలికి, ఐపిఎస్ అధికారి సమీర్ శర్మకు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో తన పెళ్లికి రావాలంటూ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు ఆమ్రపాలి.

ఆదివారం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిశారు ఆమ్రపాలి. ఆమ్రపాలి కుటుంబసభ్యులతో వెళ్లి గవర్నర్ దంపతులను తన పెళ్లికి రావాలంటూ ఆహ్వానించారు ఆమ్రపాలి. ఈ విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు ధృవీకరించాయి. ఆమ్రపాలి గవర్నర్ దంపతులను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఆమ్రపాలికి ఢిల్లీకి చెందిన 2011 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మతో జరగనుంది. ఆయన ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ డామన్‌ ఎస్పీగా పని చేస్తున్నారు.  ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. ఇందు కోసం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7 వరకు కలెక్టర్ ఆమ్ర పాలి సెలవు తీసుకోనున్నారు.

పెళ్లి తర్వాత ఈ నెల 22న వరంగల్ లో, 25న హైదరాబాద్‌లో సన్నిహితులకు గ్రాండ్ పార్టీ  ఇవ్వనున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పురప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే హోటల్స్ బుకింగ్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ తో పాటు మిగతా ప్రముఖులను కూడా కలిసి తన పెళ్లికి రావాలంటూ ఆహ్వాన పత్రాలు అందజేసే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలో చర్చలు సాగుతున్నాయి.

మరి ఆమ్రపాలి ఇంకెవరిని తన పెళ్లికి ఆహ్వానిస్తారా అన్నది ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అమ్మాయి అయిన ఆమ్రపాలి రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులను తన పెళ్లికి ఆహ్వానించే అవకాశాలున్నట్లు చర్చలు సాగుతున్నాయి.