వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి సరికొత్త రికార్డు సృష్టించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాకు ఆమె కలెక్టర్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె వరంగల్ అర్బన్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాకు తొలి కలెక్టర్ గా ఏడాది సర్వీసు పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు ఆమ్రపాలి.

అయితే కొత్త జిల్లాలకు నియమితులైన కలెక్టర్లు అందరూ ఏడాది పూర్తి చేసి రికార్డులు నెలకొల్పారు కదా? ఆమ్రపాలి ప్రత్యేకత ఏముందబ్బా అన్న అనుమానాలు మీకు కలగొచ్చు. నిజమే ఆమ్రపాలితోపాటు కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా నియమితులైన వారు చాలామంది కూడా ఏడాది పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిన మాట వాస్తవమే. కొత్త జిల్లాలకు ప్రీతిమీనా, మురళి, శ్వేతామహంతి లాంటి వాళ్లు కూడా కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా నియమితులైన  వారే.

కానీ వారికి, ఆమ్రపాలికి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. అదేమంటే వారంతా అమావాసకో, పున్నానికో వార్తల్లో వ్యక్తులుగా నిలిచేవారు. వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అవినీతి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం విషయంలో అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేసి హల్ చల్ చేశారు.

ఇక భూపాలపల్లి కలెక్టర్ మురళి పలు సందర్భాల్లో సైకిల్ మీద వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకుని అప్పుడో ఇప్పుడో వార్తల్లో నిలిచారు.

ఇక జనగామ కలెక్టర్ శ్రీదేవసేన స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై ఘాటైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టడంతోపాటు ఎమ్మెల్యేను ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు.

ఇక మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. శంకర్ నాయక్ తన చేయి పట్టుకున్నాడని ఆరోపించి శకంర్ నాయక్ బండారాన్ని మొత్తం జనం ముందుంచారు. ఆ తర్వాత ఆమ్రపాలితో కలిసి ప్రీతిమీనా ఫారెస్టులో 12 కిలోమీటర్లు నడిచి వార్తల్లో ఉన్నారు.

ఇకొంతమంది యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్లు అప్పుడో ఇప్పుడో వార్తల్లో ఉన్నారు తప్ప అనునిత్యం వారు చర్చనీయాంశంగా లేరు. కానీ వరంగల్ అర్బన్ కలెక్టర్ మాత్రం ఆమె ఏమి చేసినా... జనాల్లో చర్చ జరిగిన పరిస్థితి ఉంది. ఆమెను కేవలం వరంగల్ ప్రజలే కాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఫాలో అయ్యే పరిస్థితి ఉంది. ఫారెస్టులో 12 గంటలపాటు నడిచి హల్ చల్ చేసినా, హైదరాబాద్ లో రన్ కార్యక్రమంలో పరిగెత్తి హడావిడి చేసినా, ఆమె వేషధారణతో జనాల్లో చర్చలు చేసినా... ఆమెకే చెల్లింది. కొండలు గుట్టలు ఎక్కి హల్ చేయడం చర్చనీయాంశమైంది. వరంగల్ లో వినాయక చవితి సందర్భంగా కొందరు యువకులు ఆమె ఒడిలో వినాయకుడు కొలువుదీరినట్లు విగ్రహం తయారు చేయించడం కూడా జనాల్లో చర్చ జరిగిన వాతావరణం ఉంది. ఆమె ఏది చేసినా కలర్ ఫుల్ గా ఉండడంతో జనాల్లో ఆమెపట్ల క్రేజ్ మాత్రం ఎంతో ఉండేది.

అందుకే అందరు కలెక్టర్ల కంటే ఆమ్రపాలి ఏడాది పాలనాకాలం కలర్ ఫుల్ గా సాగిందని చెప్పుకోవచ్చు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/JKVLp1