ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారు.. అమిత్ షా
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. తెలంగాణ విమోచనంపై రాజకీయం చేసేవారిని ప్రజలు క్షమించరని అన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. తెలంగాణ విమోచనంపై రాజకీయం చేసేవారిని ప్రజలు క్షమించరని అన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వార్ మెమోరియల్ వద్ద అమిత్ షా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తర్వాత కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. షోయబ్ ఉల్లాఖాన్ స్మారక, రామ్‌జీ గొండు స్మారక ప్రత్యేక పోస్టర్ కవర్‌లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్న వీర పౌరులందరికీ నా వందనం. ఈ పోరాటంలో అత్యున్నత త్యాగం చేసిన వారికి నేను హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నాను. ఈ సువిశాలమైన హైదరాబాద్, కళ్యాణ్-కర్ణాటక, మరాఠ్వాడలను భారత యూనియన్‌లో విలీనం చేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌కు కూడా నా నివాళులర్పిస్తున్నాను. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ లేకుంటే ఈ సువిశాల ప్రాంతం ఇంత త్వరగా విముక్తి పొంది ఉండేది కాదు. 'నేషన్ ఫస్ట్' అనే సూత్రాన్ని అనుసరించి..హైదరాబాద్‌లో పోలీసు చర్య నిర్ణయం తీసుకుని, నిజాం రజాకార్ల సైన్యాన్ని చుక్క రక్తం చిందకుండా లొంగిపోయేలా చేసింది సర్దార్ పటేల్’’ అని పేర్కొన్నారు.
బ్రిటిష్ వారి నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, హైదరాబాద్‌ను క్రూరమైన నిజాం 399 రోజులు పాలించారని అన్నారు. ఈ 399 రోజులు ఇక్కడి ప్రజలకు నరకయాతనల కంటే కష్టతరమైందని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సర్దార్ పటేల్ 400వ రోజున ఈ ప్రాంతానికి విముక్తి కల్పించారని గుర్తుచేశారు. ఈ ఉద్యమంలో అనేక సంస్థలు పోరాడాయని చెప్పారు. ఆర్యసమాజ్ అయినా, హిందూ మహాసభ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ వందేమాతరం ఉద్యమం అయినా, బీదర్ రైతుల ప్రజా పోరాట ఉద్యమాలైనా.. వీటన్నింటి పోరాటానికి సర్దార్ పటేల్ తుది రూపం ఇచ్చారని అన్నారు.
పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైందని అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజును సేవా దివస్‌గా జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఇక, అమిత్ షా తన ప్రసంగం అనంతరం దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు.