ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నేత.. తెలంగాణలో బీజేపీ వ్యూహం?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 35 శాతం అభ్యర్థులను ఓబీసీల నుంచే తీసుకుంటామని చెప్పిన బీజేపీ.. సీఎం క్యాండిడేట్‌గానూ ఓబీసీ నేతనే ప్రకటించాలనే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన దాదాపుగా ముగిసిపోయింది. కాంగ్రెస్ కూడా త్వరలోనే ముగించుకోనుంది. కాగా, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. వ్యూహాత్మకంగానే తాము అభ్యర్థుల ప్రకటనపై జాప్యం చేస్తున్నామని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ బీజేపీ నేతలు బుధవారం సాయంత్రంమే ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పలువురు అగ్రనేతలతోపాటు సమావేశమయ్యారు. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఎంపిక పై తుది నిర్ణయం తీసుకోనుంది. తొలి విడతలో 50 నుంచి 70 మంది అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. దీనికితోడు ఒక ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నేతను ప్రకటించే అవకాశం ఉన్నదని, లేదా అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే హామీ అయినా ఇచ్చే అవకాశం ఉన్నదని తెలిసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం క్యాండిడేట్‌గా ఓబీసీ నేతను ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపారు. ఇప్పటికే బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి కుల జనగణన గురించి హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి దీటుగా ఈ నిర్ణయం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ అధిష్టానం నుంచి ఈ మేరకు సంకేతాలు రాష్ట్ర నాయకత్వానికి అందినట్టు ఆ సీనియర్ నేత వివరించారు. ఒకటి రెండు రోజుల్లో ఓబీసీ నేతను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించే అవకాశం ఉన్నదని, లేదంటే అధికారంలోకి వచ్చాక ఓబీసీనే సీఎంను చేస్తామని హామీ ఇవ్వనుందనీ ఆయన తెలిపారు.
Also Read: పాలస్తీనా ప్రెసిడెంట్‌కు ప్రధాని మోడీ ఫోన్.. ‘మా వైఖరి మారదు’
తెలంగాణ బీజేపీలో కీలకమైన ఓబీసీ నేతలు ముగ్గురు ఉన్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చాకు సారథ్యం వహిస్తున్న లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఓబీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి మైలేజీ వస్తుందని అగ్రనేతలు భావిస్తున్నారని ఆ నేత తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంలో భాగంగా బీజేపీ రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు జనసేన మద్దతు కోసం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ రెండు పార్టీలు ఏపీలో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని 32 సీట్లకు జనసేన ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ సానుకూలంగా వ్యవహరిస్తున్న టీడీపీ తెలంగాణలోనూ పోటీకి సిద్ధం కావడం గమనార్హం. దీంతో ఈ మూడు పార్టీల మధ్య ఏపీ సీన్ రిపీట్ అవుతుందా? అనే ప్రశ్న కూడా వినిపిస్తున్నది.