అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు త్వరలో రాజకీయాల్లో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నేడు తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు.   

క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. పలు సేవ కార్యక్రమాల్లో చేస్తూ.. గొప్ప మనస్సున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన ఏ పార్టీలో చేరుతారని ఆసక్తి నెలకొని ఉంది. ఈ వార్తలన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ.. కీలక ప్రకటన చేశారు. ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలను సందర్శించిన అంబటి రాయుడు.. తన రాజకీయ రంగప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తాను రాజకీయ పార్టీ వైపు అడుగులు వేయడంలేదని, ప్రస్తుతం తాను సమాజాన్ని అధ్యయనం చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను ఇంకా ఏ రాజకీయ పార్టీలో చేరలేదని స్పష్టం చేస్తూ.. ఎక్కడి నుంచి పోటీ లేదని వెల్లడించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్షయపాత్ర వంటశాలను సందర్శించడం సంతోషంగా ఉందనీ, 22 లక్షల మంది చిన్నారులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా భోజనం అందిస్తున్నారని తెలిపారు. ఏపీలోనూ కొన్ని స్కూళ్లలో జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర వంటశాల నుంచే భోజనాలు వెళుతుందని , అక్షయపాత్ర కిచెన్లల్లో అత్యున్నత నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారని తెలిపారు.

 అక్షయ పాత్ర ద్వారా పిల్లలకు ఆహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఐపీఎల్‌ జట్టు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. తనకు క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నానని పేర్కొన్నారు. అయితే తన మనుసులోని మాటను వెల్లడించకుండానే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అక్కడి సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నట్టు తెలిపారు.